AP Employees: మాకు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారు: బొప్పరాజు ఆవేదన
ABN, First Publish Date - 2023-03-03T16:20:03+05:30
మాకు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారు. కాబట్టే ఉద్యమబాట పడుతున్నాం. ఉద్యోగుల (Employees) బకాయిలను రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చారు..
ప్రకాశం: ‘‘మాకు బతకలేని పరిస్థితి తీసుకువచ్చారు. కాబట్టే ఉద్యమబాట పడుతున్నాం. ఉద్యోగుల (Employees) బకాయిలను రిటైర్మెంట్ తర్వాత ఇస్తామని జీవో ఇచ్చారు. మాకు రావాల్సినవి డబ్బులు రావు. మేము దాచుకున్నవి ఇవ్వరు’’ అని ఏపీ జేఏసీ–అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 9 నుంచి మా ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. ఉద్యమంపై మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి Sajjala (Ramakrishna Reddy) ఉద్యోగసంఘాలతో చర్చించారని, ఇప్పటికే ప్రభుత్వానికి చాలా సమయం ఇచ్చామని చెప్పామని తెలిపారు. కరోనా దృష్ట్యా ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించామని గుర్తుచేశారు. పీఆర్సీ రాయితీలను తగ్గించడం వల్లే రోడ్డు మీదకు వచ్చామని పేర్కొన్నారు. ఒకటో తేదీన ఇవ్వాల్సిన వేతనాలు ఎప్పుడిస్తారో తెలియదని వాపోయారు. తమది ఉద్యమం కాదు.. ప్రభుత్వం విస్మరించిన పనిని గుర్తుచేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగుల న్యాయబద్ధమైన రాయితీలు ఇస్తామని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.
ఉద్యోగుల వెతలు..
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు వేతన వెతలు ప్రారంభమయ్యాయి. జీతం చేతికి ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విడతలవారీగా జమ చేస్తుండడంతో కొందరి ఖాతాల్లో పడే సరికి నెల ముగిసిపోతోంది. కొన్నిశాఖల్లో పనిచేస్తున్న వారికి రెండు నెలలు గడిచి మూడో నెల ముగింపునకు వస్తున్నా ఇంకా వేతనం అందని పరిస్థితి ఏర్పడింది. పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని వారు అడుక్కోవాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వంనుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
Updated Date - 2023-03-03T16:20:15+05:30 IST