Atchannaidu: టచ్‌లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు మాకే ఆఫర్లు ఇస్తున్నారు
ABN, First Publish Date - 2023-04-06T19:52:36+05:30
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) విమర్శలు గుప్పించారు. చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, టచ్‌లో ఉండటమే కాకుండా ఎదురు తమకే ఆఫర్లు ఇస్తున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు. ఒకరికి సీటు ఇస్తే.. నలుగురం వస్తామంటూ ఫోన్లు చేస్తున్నారని, వైసీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని ఆ పార్టీ నేతలకు అర్థమైందని అచ్చెన్నాయుడు అన్నారు. ఎమ్మెల్యేలు అంటే జగన్కు గౌరవం లేదని, జగన్ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని, ఎమ్మెల్సీ ఎన్నికలతో జగన్ మనస్తత్వం అర్థమైపోయిందని అచ్చెన్న విమర్శించారు. వైసీపీలో ఇబ్బందులు, ప్రజావ్యతిరేకతతో ధర్మాన బ్యాలెన్స్ తప్పారని, మగవాళ్లు పోరంబోకులు అని మంత్రి ధర్మాన అన్నారని, 'జగన్, ధర్మాన కూడా మగాళ్లే కదా.. వాళ్లూ పొరంబోకులేనా..?' అని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
సీతారాముల కల్యాణానికి సీఎం దంపతులు వెళ్లడం ఆనవాయితీ అని, కాలు బెణికిందన్న సాకుతో సీఎం జగన్ ఒంటిమిట్ట వెళ్లలేదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చిలకలూరిపేట కార్యక్రమాల్లో జగన్ చకచకా నడుచుకుంటూ వెళ్లారని, జగన్ వేరే మతాన్ని ఆచరించొచ్చని,.. సీఎం హోదాలో ఒంటిమిట్ట వెళ్లవచ్చుకదా అని ఆయన ప్రశ్నించారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా జగన్ ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు..పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగంగుంట్లలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(CM YS Jagan Mohan Reddy) గురువారం పర్యటించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్(Cm Jagan) ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో జగన్ మాట్లాడుతూ..‘‘ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది కూడదు. ప్రతీ ఒక్కరికీ భరోసా కల్పిస్తున్న పథకం ఇది. గ్రామాల్లో ఉచితంగా ఆధునిక వైద్యం అందించే పథకం. డాక్టర్ల కోసం ప్రజలు వెళ్లాల్సిన అవసరం లేదు..డాక్టర్లే మీ ఇంటి దగ్గరకు వస్తారు. మందులు కూడా ఉచితంగా అందించే..గొప్ప కాన్సెప్ట్.. ఫ్యామిలీ డాక్టర్ పథకం. పెన్షన్లు ఏవిధంగా మీ ఇంటికే వస్తున్నాయో అదే విధంగా డాక్టర్ మీ ఇంటికొస్తాడు. దేశం మొత్తం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను(Family doctor concept) కాపీ కొడతారు. ప్రతి ఒక్కరికి రక్షణ కవచంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నిలబడుతుంది. పేదవాడి ప్రాణాలు గాల్లో దీపం అన్న నానుడి మార్చిన ఘనత వైఎస్స్ దే. ఆరోగ్య శ్రీని పద్ధతి ప్రకారం నీరు గార్చారు. వెయ్యి జబ్బులకు మాత్రమే కట్టడి చేశారు. నెట్ వర్క్స్ ఆసుపత్రులకు రూ. 800 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ ప్రభుత్వంలో రూ. 9000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. వైద్య ఆరోగ్య శాఖలో 48,639 ఉద్యోగాలిచ్చాం. గతానికి ప్రస్తుతానికి తేడా చూడండి. వందకి వంద శాతం ఖాళీలు భర్తీ చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు.
Updated Date - 2023-04-06T19:53:37+05:30 IST