టీడీపీ కార్యకర్త బాలకృష్ణపై దాడి.. డీజీపీకి చంద్రబాబు లేఖ
ABN, First Publish Date - 2023-04-30T16:58:26+05:30
డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy)కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలతో పాటు..
అమరావతి: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి (DGP Rajendranath Reddy)కి టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) లేఖ రాశారు. కుప్పం నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలతో పాటు టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతల దాడులను వివరిస్తూ డీజీపీకి లేఖ రాశారు. పోలీసుల సహకారంతోనే వైసీపీ గూండాల దాడులు చేశారని వివరించారు. టీడీపీ నేత బాలకృష్ణ (Balakrishna)పై, ఆయన ఇంటిపై దాడులు జరిగాయని తెలిపారు. బాలకృష్ణ బైక్ను తగులబెట్టి ఆ ప్రాంతంలో అలజడి సృష్టించారని లేఖలో పేర్కొన్నారు. ఇన్నాళ్లూ కుప్పం ప్రశాంతమైన, సురక్షితమైన ప్రదేశంగా ఉండేదని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ (Kuppam Assembly constituency)లో హింసాత్మక చర్యలు మొదలు పెట్టిందని మండిపడ్డారు.
వైసీపీ దాడులు, హింసకు పోలీసులు కూడా పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారని విమర్శించారు. నిందితులను వదిలి బాధిత టీడీపీ కార్యకర్తలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, టీడీపీ క్యాడర్‌పై రౌడీ షీట్లు తెరుస్తున్నారని తప్పుబట్టారు. వైసీపీ గూండాల చర్యల కారణంగానే ప్రశాంతమైన కుప్పంలో 2019 తరువాత హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి తెలిపారు. వైసీపీ హింసను టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజాస్వామ్య పద్దతిలోనే అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని లేఖలో వివరించారు. దాడులకు పాల్పడుతున్న వైసీపీ గూండాలను అరెస్టు చేయకుండా కేవలం టీడీపీ క్యాడర్‌పై పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు. పోలీసులు ఇదే తీరుతో వ్యవహరిస్తూ పోతే.. కుప్పంలో ప్రజాస్వామ్యం పూర్తిగా బలి అవుతుందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చంద్రబాబు చేశారు.
టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు వరుస దాడులకు తెగబడుతున్నాయి. దీంతో సహనం కోల్పోయిన టీడీపీ శ్రేణులు ప్రతిఘటించడంతో ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న కుప్పం రణరంగాన్ని తలపించింది. శుక్రవారం రాత్రి లక్ష్మీపురం జాతరలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో మొదలైన ఘర్షణ శనివారం ఉదయం కూడా కొనసాగింది. బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. కుప్పం పురపాలక సంఘం పరిధిలోని లక్ష్మీపురంలో శుక్రవారం రాత్రి గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాటకచేరి ఏర్పాటు చేశారు. అధికార పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరలో రికార్డు డ్యాన్సులు కూడా నిర్వాహకులు పెట్టారంటున్నారు. కార్యక్రమాలు కొనసాగుతుండగా వాసు అనే టీడీపీ కార్యకర్త వేదికనెక్కి డ్యాన్సు చేయసాగాడు. ఇది టీడీపీ కార్యక్రమం కాదని అతడిని వైసీపీ కార్యకర్త మణి బలవంతంగా దింపేశాడు. ఈ సమయంలో వాసుపై భౌతికంగా వైసీపీ కార్యకర్తలు దాడిచేసినట్లు కూడా సమాచారం.
విషయం తెలుసుకున్న టీడీపీ కుప్పం మున్సిపల్ తెలుగు యువత నాయకుడు బాలు, మరికొద్దిమంది టీడీపీ కార్యకర్తలతో అక్కడికి చేరున్నారు. ఒకరిని మరొకరు తీవ్ర పదజాలంతో దూషించుకున్నారు. ఇరువర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. ఈ దాడుల్లో టీడీపీ కార్యకర్త వాసు గాయపడి, కుప్పం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కూడా తీసుకున్నాడు. ఈ వివాదం ఇంతటితో ముగియలేదు. బాలుపై కక్ష పెంచుకున్న వైసీపీ శ్రేణులు శనివారం ఉదయం కుప్పం పట్టణం హెచ్‌పీ రోడ్డులోని అతడి ఇంటిపై దాడికి తెగబడ్డాయి. రాళ్లు, రాడ్లు, దుడ్డుకర్రలతో వీరంగం సృష్టించాయి. బాలు ఇంటిముందు పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టగా, అది పూర్తిగా కాలిపోయింది. అక్కడే ఉన్న మరో వాహనాన్నీ ధ్వంసం చేశారు.
Updated Date - 2023-04-30T16:58:26+05:30 IST