Gudivada Amarnath: మే 3న భోగాపురం ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన
ABN, First Publish Date - 2023-04-10T15:53:15+05:30
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bhogapuram Airport), మే 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) శంకుస్తాపన చేస్తారని మంత్రి గుడివాడ
భోగాపురం: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి (Bhogapuram Airport) మే 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (CM Jagan) శంకుస్థాపన చేస్తారని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ (Gudivada Amarnath) తెలిపారు. ఈ విమానాశ్రయ నిర్మాణంతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణానికి సేకరించిన భూములను మంత్రి అమర్‌నాథ్ సోమవారం సందర్శించారు. ట్రంపెట్ రహదారి నిర్మాణం జరిగే ప్రదేశాన్ని, ముఖ్యమంత్రి నిర్వహించే భారీ బహిరంగ సభ ప్రదేశాలను ఆయన పరిశీలించారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంఎల్ఏ బడ్డుకొండ అప్పలనాయుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో, అంతకుముందు సన్‌రే రీసార్ట్‌లో సమావేశాన్ని నిర్వహించారు. ఇప్పటివరకు జరిగిన భూ సేకరణ ప్రక్రియను తెలుసుకున్నారు. శంకుస్థాపన, ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లపై అధికారులు, నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ... భోగాపురం విమానాశ్రయ నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తోందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమయ్యిందని అన్నారు. శంకుస్థాపన జరిపేందుకు అవసరమైన అన్ని రకాల లాంఛనాలను పూర్తి చేశామని చెప్పారు. సుమారు 2,200 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ ఎయిర్‌పోర్టుకు, ఇప్పటికే దాదాపు 2,195 ఎకరాల భూసేకరణ పూర్తి అయ్యిందని, మిగిలిన కొద్దిపాటి భూ సేకరణ కూడా త్వరలో పూర్తి కానుందని తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని గుడివాడ అమర్‌నాథ్ చెప్పారు. శంకుస్థాపన అనంతరం 24 నుంచి 30 నెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తి అవుతుందని ప్రకటించారు.
Updated Date - 2023-04-10T16:08:46+05:30 IST