BJP: విజయవాడలో బీజేపీ వ్యవస్థాపకనేత శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
ABN, First Publish Date - 2023-07-06T12:50:28+05:30
నగరంలోని బీజేపీ వ్యవస్థాపక నేత డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
విజయవాడ: నగరంలోని బీజేపీ వ్యవస్థాపక నేత డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖర్జీ చిత్రపటానికి సోము వీర్రాజు, ఇతర నేతలు పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సోమువీర్రాజు మాట్లాడుతూ... శ్యాం ప్రసాద్ జయంతిని దేశ వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తోందని తెలిపారు. ఆయన జీవితం దేశ ప్రజలకు స్పూర్తిదాయకమన్నారు. ఆయన ఆలోచన విధానాలు ముందు చూపుకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. అంబేద్కర్‌తో పాటు మంత్రి వర్గంలో పని చేశారని.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో ఆనాడే నెహ్రూ నిర్ణయాలను వ్యతిరేకించారని తెలిపారు. మంత్రివర్గంలో ఉండి కూడా తన అభిప్రాయాలను ధైర్యంగా చెప్పేవారని గుర్తుచేశారు. భారతదేశం మొత్తం ఒకే జెండా, కాశ్మీర్‌కు మరో జెండా ఉండాలనేది నెహ్రూ విధానమని.. ఈ అంశాలపై విభేదించి ముఖర్జీ భారతీయ జన సంఘాన్ని ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
భారతదేశంలో కాశ్మీర్ అంతర్భాగం అని చాటి చెబుతూ ఉద్యమం చేశారన్నారు. ఆ తర్వాత జన సంఘ్ తరపున ఎంపీగా ముఖర్జీ గెలిచారని తెలిపారు. చట్ట సభలో కూడా నెహ్రూ విధానాలను ప్రశ్నించారని.. ఆ తరువాత గెస్ట్ హౌస్‌లో ముఖర్జీ అనుమానాస్పదంగా మృతి చెందారన్నారు. మోడీ వచ్చాక ఆక్రమిత కాశ్మీర్‌ను స్వాధీనం చేసుకున్నారన్నారు. టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించారని తెలిపారు. కొన్ని లక్షల మంది కాశ్మీర్‌కు పర్యాటకులుగా వెళుతున్నారని తెలిపారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆలోచనలను మోడీ అమలు చేశారన్నారు. ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అవినీతి పార్టీలను ఓడించాలన్నారు. లక్షల కోట్లు దోచుకున్న వారు అధికారంలోకి రావడం అనేది వారి కల మాత్రమే అన్నారు. దేశభక్తితో పార్టీని నిర్మాణం చేసిన ముఖర్జీ ఆశయాలను మోడీ అమలు చేస్తున్నారని సోమువీర్రాజు పేర్కొన్నారు.
Updated Date - 2023-07-06T12:50:28+05:30 IST