Bopparaju: ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగి వచ్చింది
ABN, First Publish Date - 2023-06-09T16:33:25+05:30
ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగివచ్చి 36 డిమాండ్లు నెరవేర్చిందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) తెలిపారు.
విజయవాడ: ఉద్యోగుల ఉద్యమంతోనే ప్రభుత్వం దిగివచ్చి 36 డిమాండ్లు నెరవేర్చిందని ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Chairman Bopparaju Venkateshwarlu) తెలిపారు. గతంలో ఇంతలా ఉద్యమం జరగలేదని గుర్తుచేశారు. శాఖాధిపతులు ఉద్యోగ సంఘాలతో ప్రతినెలా భేటీ అయితేనే సమస్యలు పరిష్కారం లభిస్తుందన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ (Joint Staff Council)ను ప్రభుత్వం పునర్వ్యవస్ధీకరించాలని డిమాండ్ చేశారు. కష్టపడి పనిచేసే సంఘాలకు గుర్తింపు రావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఉద్యోగులకు ఇప్పటిదాకా అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్ )ను రద్దు చేసి.. ఆ స్థానంలో గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్)-2023 అమలు చేయాలని కేబినెట్ (Cabinet) నిర్ణయించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం మూల వేతనంలో 50 శాతాన్ని పింఛన్‌గా చెల్లిస్తారు. ఇప్పటిదాకా వైద్య రంగంలో స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ను రద్దు చేసి ప్రభుత్వ నిర్వహణలోకి తీసుకురావాలని నిర్ణయించారు. కేబినెట్ నిర్ణయంతో 14,658 మంది వైద్య విధాన పరిషత్ సిబ్బంది ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించాలని కూడా కేబినెట్ నిశ్చయించింది. 2014 జూన్ రెండో తేదీకి ముందు ఐదేళ్ల సర్వీసు కలిగిన 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే దీనికి అర్హులని తెలిపింది. పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్) అమల్లోకి వస్తే.. ఇవ్వాల్సిన పెన్షన్ల మొత్తం ఉద్యోగుల జీతాలను కూడా దాటేస్తుందని కేబినెట్ పేర్కొంది.
Updated Date - 2023-06-09T16:33:48+05:30 IST