కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viveka Case: వివేకా కేసులో సీబీఐకి జగన్ అటెండర్ నవీన్ ఏం చెప్పాడంటే... హత్య విషయాన్ని జగన్‌కి చెవిలో చెప్పింది ఎవరంటే..

ABN, First Publish Date - 2023-07-21T16:35:30+05:30

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ సమర్పించింది. అలాగే మరికొంత మంది సాక్షుల వాంగ్మూలాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది.

Viveka Case: వివేకా కేసులో సీబీఐకి జగన్ అటెండర్ నవీన్ ఏం చెప్పాడంటే... హత్య విషయాన్ని జగన్‌కి చెవిలో చెప్పింది ఎవరంటే..

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో (Former Minister YS Viveka Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 259వ సాక్షిగా వైఎస్ షర్మిల (YS Sharmila) సహా పలువురు సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సీబీఐ సమర్పించింది. వైఎస్ షర్మిల దగ్గరి నుంచి ఆఖరికి ఏపీ సీఎం జగన్ అటెండర్ నవీన్ వాంగ్మూలను కూడా సీబీఐ తీసుకుంది. వైఎస్ వివేకా మరణించిన రోజు అవినాష్‌ రెడ్డి ఫోన్ చేశారని, కృష్ణమోహన్ రెడ్డికి ఫోన్ ఇవ్వమని అవినాశ్ చెప్పగా ఇచ్చానని, అయితే వారు మాట్లాంది తాను వినలేదని అటెండర్ నవీన్ తన వాంగ్మూలంలో తెలిపాడు.

కాగా.. గతనెల 30న కీలక సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సీబీఐ అందజేసింది. వివేకా హత్య కేసులో సాక్షిగా వైఎస్ షర్మిలతో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఓఎస్డీ పి.కృష్ణమోహన్ రెడ్డి, ఏపీ విశ్రాంత సీఎస్ అజేయ కల్లం, వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, జగన్ అటెండర్ గోపరాజు నవీన్ కుమార్‌ల వాంగ్మూలను సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. 2019 మార్చి 15న జగన్‌ లోటస్ పాండ్‌లో ఉన్నట్లు సాక్షులు తెలిపారు. మేనిఫెస్టో, జగన్ ప్రసంగంపై చర్చించేందుకు ఆ రోజు తెల్లవారుజామునే సమావేశమైనట్లు తెలిపారు.

నవీన్ ఏం చెప్పాడంటే...

‘‘వివేకా మరణించిన రోజు ఉదయం 6:30 గంటలకు అవినాష్ రెడ్డి ఫోన్ చేసి జగన్ ఉన్నారా అని అడిగారు. కృష్ణమోహన్ రెడ్డి, జీవీడీ తదితరులతో జగన్ సమావేశమయ్యారని చెప్పాను. కృష్ణమోహన్ రెడ్డికి వెంటనే ఫోన్ ఇవ్వమని అవినాష్ రెడ్డి చెప్పారు. సమావేశ గదికి వెళ్లి అవినాష్ రెడ్డి లైన్‌లో ఉన్నారని కృష్ణమోహన్‌రెడ్డికి ఫోన్ ఇచ్చాను. అవినాష్‌ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడుకున్నారో నేను వినలేదు’’ అని నవీన్ తన వాంగ్మూలంలో తెలియజేశారు.

అజేయ కల్లం వాంగ్మూలం ఇదే..

‘‘ లోటస్‌పాండ్‌లో సమావేశం జరుగుతుండగా ఉదయం 5:30 గంటల జగన్ అటెండర్ తలుపు కొట్టారు. అమ్మ(భారతి)పైకి రమ్మంటున్నారని అటెండర్ జగన్‌కు చెప్పారు. జగన్ బయటకు వెళ్లిన పది నిమిషాల తర్వాత మళ్లీ వచ్చారు. బాబాయ్ ఇక లేరని నిలబడే జగన్ మాకు చెప్పారు’’ అజేయ కల్లం వాంగ్మూలంలో తెలిపారు.

వివేక మరణం జగన్‌కు చెవిలో చెప్పా: ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి

‘‘సమావేశం జరుగుతుండగా అటెండర్ నవీన్ తలుపు తెరిచారు. సమావేశం నుంచి బయటకు రావాలని నన్ను నవీన్ కోరారు. అవినాష్ రెడ్డి మాట్లాడతారని నవీన్ నాకు ఫోన్ ఇచ్చారు. వివేకా మరణించారని అవినాష్ రెడ్డి నాకు ఫోన్లో చెప్పారు. ఎలా జరిగిందని అవినాష్ రెడ్డిని అడిగాను. బాత్రూంలో మృతదేహం ఉందని అవినాష్ చెప్పారు. బాత్‌రూంలో చాలా రక్తం ఉందని కూడా అవినాష్ చెప్పారు. జగన్‌కు సమాచారం ఇవ్వండని చెప్పి అవినాష్ ఫోన్ కట్ చేశారు. వివేకా మరణం విషయం జగన్‌కు నేను చెవిలో చెప్పాను. బెడ్‌రూం, బాత్‌రూంలో రక్తం విషయం కూడా చెప్పాను. జగన్ తన ఇంటిలోకి వెళ్లి.. తర్వాత పులివెందుల బయలుదేరారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య అవినాష్‌తో ఐదు సార్లు ఎందుకు మాట్లాడారన్న సీబీఐ. కచ్చితంగా గుర్తులేదు కానీ జగన్ పర్యటన కోసమే అయి ఉంటుంది. జగన్ ఫోన్ వాడరు. పీఏ లేదా నా ఫోన్‌లోనే మాట్లాడతారు’’ అంటూ కృష్ణమోహన్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చారు.

ఎవరో నాకు గుర్తు లేదు: ఉమ్మారెడ్డి

‘‘సమావేశం జరుగుతుండగా ఎవరో వచ్చి వివేకా మరణించారని జగన్‌కు చెప్పారు. వివేకా మరణంపై జగన్‌కు చెప్పింది ఎవరో నాకు గుర్తు లేదు’’ అని ఉమ్మారెడ్డి తెలిపారు.

Updated Date - 2023-07-21T16:51:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising