Polavaram: పోలవరంపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన
ABN, First Publish Date - 2023-02-06T20:33:22+05:30
పోలవరం (Polavaram)పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గడువులోగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాదని కేంద్రం తెలిపింది....
ఢిల్లీ: పోలవరం (Polavaram)పై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గడువులోగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తికాదని కేంద్రం తెలిపింది. పోలవరం నిర్మాణం.. పురోగతిపై రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర (Kanakamedala Ravindra) ప్రశ్నకు కేంద్రమంత్రి భిశ్వేశ్వరుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2024 మార్చి నాటికి పోలవరం నిర్మాణం పూర్తికావాల్సి ఉన్నా.. మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గతంలో వరదల వల్ల పోలవరం ప్రాజెక్ట్‌కు నష్టం జరిగిందని ఆయన తెలిపారు. 2022 అక్టోబర్ వరకు మొత్తం ప్రాజెక్ట్‌లో 78.99% పూర్తయిందని తెలిపారు. 2014 డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ వరకూ పోలవరం ప్రాజెక్ట్‌కు.. రూ.16,035.88 కోట్లు ఖర్చయినట్లు ఏపీ ప్రభుత్వం తెలిపిందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. పోలవరం అథారిటీ రూల్స్ (Polavaram Authority Rules) మేరకు ఇప్పటివరకు రూ.13,226.04 కోట్లు విడుదల చేశామని, రూ.2,390.27 కోట్లు తిరిగి చెల్లించేందుకు అర్హత లేదని భిశ్వేశ్వరుడు స్పష్టం చేశారు. రూ.548.38 కోట్ల బిల్లులు ప్రాజెక్ట్ అథారిటీ పరిశీలనలో ఉన్నాయని కనకమేడల ప్రశ్నకు భిశ్వేశ్వరుడు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిరాశ
కేంద్ర బడ్జెట్ (Central budget)లో పోలవరంపై నామమాత్రంగానైనా ప్రస్తావన లేదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టిన దగ్గర నుంచి ముగించేంత వరకు ఆశతో అందరూ చెవురిక్కించి మరీ ఆలకించారు. పోలవరం ప్రాజెక్టుకు సంతృప్తికర నిధులు కేటాయించడమే కాకుండా విధాన ప్రకటన చేస్తారని ఆశించిన వారందరికీ భంగపాటు ఎదురైంది. పోలవరంను ప్రస్తావించకపోవడాన్ని అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. ఇప్పటికే పోలవరం పనులు కుంటుపడిపోగా గడిచిన రెండేళ్ళల్లో ప్రాజెక్టు డిజైన్లను కుదించేలా వ్యవహరించారు. ఇప్పుడేమో నిధుల ప్రస్తావన లేకుండా గుంభనంగా ఉన్నారు. ఇంకోవైపు పోలవరం నిరాశ్రయుల గురించి, వారికి ఇవ్వాల్సిన ప్యాకేజీల గురించి ఇసుమంతైనా నిర్మలమ్మ ప్రస్తావించకపోవటాన్ని ప్రజా సంఘాలు తప్పుపడుతున్నాయి. అత్యధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం లేకపోవటం ఏమిటనే ప్రశ్న అందరినీ వేధిస్తుంది.
Updated Date - 2023-02-06T20:49:27+05:30 IST