Chandrababu: పంచ భూతాలనూ మింగేశారు
ABN, First Publish Date - 2023-06-16T21:25:42+05:30
రాష్ట్రంలో వైసీపీ నాయకులు అన్నిరకాల అక్రమాలకు పాల్పడుతూ పంచభూతాలను మింగేశారు. ఇంతకాలం ప్రజల్ని భయపెట్టి సీఎం జగన్ (CM Jagan) పాలించారు.
కుప్పం: ‘‘రాష్ట్రంలో వైసీపీ నాయకులు అన్నిరకాల అక్రమాలకు పాల్పడుతూ పంచభూతాలను మింగేశారు. ఇంతకాలం ప్రజల్ని భయపెట్టి సీఎం జగన్ (CM Jagan) పాలించారు. ఇన్నాళ్లు భరించిన ప్రజలు ఇకనుంచి ఎదురు తిరుగుతున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేయడమే మిగిలింది’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కుప్పంలో శుక్రవారంతో చంద్రబాబు మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ముచ్చటించారు. ‘పులివెందుల (Pulivendula)లో జగన్ ప్రజల్ని భయపెట్టి గెలుస్తున్నారు. కుప్పంలో నేను ప్రజాభిమానంతో గెలుస్తున్నా. రాబోయే రోజుల్లో ఆడవారికి రక్షణ ఉండదు. మీ అమ్మాయి బాగుంటే ఆ వీధి రౌడీ పంపించమంటే మీరు పంపించాలి. లేదంటే ఊరి వదిలి వెళ్లాలి. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండి, సీఎంగా, ప్రతిపక్షనేతగా గౌరవంగా బతుకుతున్న నాజోలికి ఎవరైనా వస్తారా? మీడియా దిగ్గజం రామోజీరావు దగ్గరికి ఎవరైనా వెళ్తారా? లెక్కలేనితనం అయిపోయింది. ఎవ్వరినీ ఖాతరు చేయడం లేదు. సీఎం జగన్ పోలవరాన్ని బ్యారేజ్‌గా మార్చేశాడు. సీఎం కేసీఆర్ (CM KCR) కాళేశ్వరంతో సస్యశ్యామలం చేశారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ముగిసిన చంద్రబాబు పర్యటన
చంద్రబాబు మూడు రోజుల కుప్పం పర్యటన కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇటీవల సమన్వయ కమిటీని నియమించిన చంద్రబాబు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను దానికి చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఆ సమన్వయ కమిటీ మీటింగ్ నిర్వహించి కుప్పంలో లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సాధించే దిశగా ఎలా కృషి చేయాలో సూచించారు. ఎప్పటిలా గ్రామాల్లో పర్యటనలు, రోడ్‌షోలు నిర్వహించకుండా నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేందుకే అధిక ప్రాధాన్యమించారు. యువతకు పెద్ద పీట వేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పనిచేయకుండా ఇళ్లకే పరిమితమైన నాయకులను సుతిమెత్తగా హెచ్చరించారు. నాయకుల మధ్య లోపించిన సమన్వయాన్ని సరిదిద్దుకోవాలన్నారు. కార్యకర్తలను కలుపుకుని పోవాలని సూచించారు. చివరి రోజున మీడియాతో చిట్‌చాట్‌తోపాటు రామకుప్పం, శాంతిపురం మండలాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. దీంతో మూడు రోజుల పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు.
Updated Date - 2023-06-16T21:26:29+05:30 IST