Share News

Chandrababu : చంద్రబాబుకు స్కిన్‌ ఎలర్జీ!

ABN , First Publish Date - 2023-10-13T03:07:09+05:30 IST

కారాగారంలో సౌకర్యాల లేమి, ఎండ వేడిమి, డీహైడ్రేషన్‌తో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్కిన్‌ అలర్జీతో బాధపడుతున్నారు.

Chandrababu  : చంద్రబాబుకు స్కిన్‌ ఎలర్జీ!

శరీరంపై దద్దుర్లు, కందిన చర్మంఇప్పటికే డీహైడ్రేషన్‌తో అస్వస్థత

సుదీర్ఘకాలంగా ఆయనకు చర్మ సమస్య

ప్రత్యేక చికిత్స, జాగ్రత్తలతో అదుపులోకి

చల్లటి వాతావరణంలో ఉండటం అవసరం

జైలులో సౌకర్యాల లేమితో సమస్య

కొన్నాళ్లుగా వేడి వాతావరణంతో ఇబ్బంది

2 రోజుల కిందటే చర్మ సమస్య గుర్తింపు

డెర్మటాలజిస్టుల కోసం

జీజీహెచ్‌కు జైలు అధికారుల లేఖ

పరీక్షించి మందులు ఇచ్చిన ఇద్దరు వైద్యులు

ప్రత్యేక చికిత్స అవసరమంటున్న నిపుణులు

రాజమహేంద్రవరం/అమరావతి, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): కారాగారంలో సౌకర్యాల లేమి, ఎండ వేడిమి, డీహైడ్రేషన్‌తో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అస్వస్థతకు గురయ్యారు. ఆయన స్కిన్‌ అలర్జీతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని రెండు రోజుల కిందటే జైలు ఆస్పత్రి వైద్యులు గుర్తించి... అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో గురువారం జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యశాల (జీజీహెచ్‌) సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు డెర్మటాలజిస్టులను పంపించాలంటూ కోరా రు. జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ లక్ష్మీ సూర్యప్రభ అప్పటికప్పుడు ఇద్దరు డెర్మటాలజిస్టులకు ఈ బాధ్యత అప్పగించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ డెర్మటాలజీ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆఫ్‌ డెర్మటాలజీ డాక్టర్‌ సీహెచ్‌వీ.సునీతా దేవి సాయంత్రం కారాగారం వద్దకు చేరుకున్నారు. అయితే... సరైన పత్రాలు లేవంటూ జైలు సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో... కాసేపటికి సూపరింటెండెంట్‌ లేఖ తీసుకువచ్చారు. సాయంత్రం 5.45 గంటల సమయంలో ఇద్దరు డాక్టర్లు జైలు లోపలికి వెళ్లారు. తిరిగి 6.30 గంటలకు బయటికి వచ్చారు. చంద్రబాబుకు గడ్డం, చేతులు, ఛాతీపై దద్దుర్లు వచ్చినట్లు సమాచారం. ఆయనను పరీక్షించిన వైద్యులు కొన్ని మందులు రాశారని... జైలు మెడికల్‌ సిబ్బంది వాటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని డీఐజీ రవికిరణ్‌ తెలిపారు.

ప్రత్యేక చికిత్స అవసరం...

చంద్రబాబు సుదీర్ఘకాలంగా చర్మ సంబంధ సమస్య ఎదుర్కొంటున్నారు. ప్రత్యేక చికిత్స తీసుకోవడంతో అది దాదాపు పూర్తిగా అదుపులోకి వచ్చింది. అయినప్పటికీ.... దైనందిన జీవితంలో ఆయన కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దుమ్ము ధూళికి అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువసేపు వేడి వాతావరణంలో ఉన్నా ఇబ్బంది తలెత్తుతుంది. చల్లటి వాతావరణం (ఏసీ)లో ఉండటం ఆరోగ్య రీత్యా ఆయనకు అవసరం. పాదయాత్ర చేసినా, ఎన్నికల ప్రచారంలో ఉన్నా, రోడ్‌ షోలు చేసినా... ఆ మేరకు చంద్రబాబు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. కానీ... ఇప్పుడు ఆయనను అక్రమ కేసులో అరెస్టు చేశారు. 34 రోజులుగా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉంచారు. జైలులో ఏసీ సదుపాయం ఉండదు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాన్లు కూడా ఆయన ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా లేవు. కొన్నాళ్లుగా ఉక్కపోత వాతావరణం ఉండటంతో చంద్రబాబు డీహైడ్రేషన్‌కు కూడా గురయ్యారు. ఇప్పుడు స్కిన్‌ అలర్జీ రావడం కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగిస్తోంది. శరీరంపై అక్కడక్కడా దద్దుర్లు వచ్చాయని, చర్మం కందిపోయిందని తెలుస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి వైద్యులను పిలిపించి, మందులు ఇచ్చినా.. ప్రత్యేక చికిత్స అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆయన ఇన్నేళ్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకున్నారని... నెల రోజులుగా నెలకొన్న పరిస్థితులతో మళ్లీ మొదటికి వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2023-10-13T07:30:19+05:30 IST