CM Jagan: నేడు సీఎం జగన్ తిరుపతి, బాపట్ల జిల్లాల పర్యటన
ABN, First Publish Date - 2023-12-08T07:06:05+05:30
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన చేయనున్నారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయి పర్యటన చేయనున్నారు. ఈ ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తిరుపతి జిల్లా, వాకాడు మండలం, బాలిరెడ్డి పాలెం వద్ద స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. అక్కడి గ్రామస్ధులు, తుపాను బాధితులతో సమావేశం అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెంకు చేరుకుంటారు. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడిన అనంతరం కర్లపాలెం మండలం, పాతనందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడతారు. అక్కడి నుంచి బుద్దాం చేరుకుని తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి సీఎం జగన్ బయలుదేరి సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
చేతికొచ్చిన పంటను తుఫాన్ నిర్దాక్షిణ్యంగా తుడిచిపెట్టేయడం రైతులను బాధిస్తోంది. ఇక ప్రభుత్వ అసమర్థత వారిని మరింత కుంగదీస్తోంది. ప్రభుత్వం మాటలతో కాలయాపన చేస్తున్నవేళ కాస్త ధైర్యాన్నిచ్చే ఆపన్న హస్తం కోసం అన్నదాతలు నీరింకిన కళ్లతో ఎదురుచూడాల్సిన పరిస్థితి. దెబ్బతిన్నపంట పొలాలను పరిశీలించి అన్నదాతలకు భరోసానివ్వడానికి టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు, బాపట్ల, పాత ప్రకాశం జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పర్యటించనున్నారు. తుఫాన్ ధాటికి జిల్లావ్యాప్తంగా 79,104 హెక్టారలో వరి పూర్తిగా దెబ్బతింది. ఇందులో అత్యధికంగా అమర్తలూరు మండలంలో 9,929 హెక్టార్లు ఉండగా, చెరుకుపల్లి 8,600, బాపట్ల మండలం 8,000, నగరం 7,200, రేపల్లె 6,800 హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. కోసి పొలం మీద ఉన్న వరి ఓదెలు మొలకెత్తడం, కుప్పలు పోసి ఉన్నవీ...రోడ్లమీద ఆరబోసి ఉన్నవీ... కలిపి మరో 2,300 హెక్టార్లుగా తేలింది. మొత్తంగా 81,404హెక్టార్లలో వరికి నష్టం వాటిల్లింది. వరి ఎక్కువగా డెల్టా పరిధిలోని వేమూరు, రేపల్లె, బాపట్లలో దెబ్బతింటే, శనగ, మిర్చి, పొగాకు లాంటి పంటలు పర్చూరు, అద్దంకి ప్రాంతాల్లో రైతులకు కన్నీటిని మిగిల్చాయి. శనగ 11,900 హెక్టార్లలో దెబ్బతినగా, పొగాకు 5,799 హెక్టారలో చేతికందకుండా పోయింది. ఉద్యాన పంట మిర్చి 4,126 హెక్టార్లలో తుడిచిపెట్టుకుపోయింది. ప్రకృతి విపత్తుకు తోడు నాలుగున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా తోడవడంతో అన్నదాతలకు కోలుకోలేని విధంగా దెబ్బతగిలింది. మొత్తం నష్టంలో దాదాపు 40,000 హెక్టార్లలో పంట నష్టం వాగులు పొంగిపొర్లి ముంచెత్తడం వల్ల జరిగింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. పర్చూరు వాగు పొంగి దాదాపు 10,000 హెక్టార్లలో పంట నీట మునిగింది. నల్లమడ డ్రైనేజీకి గండ్లు పడి ఆ నీళ్లు పంటపొలాల్లోకి ప్రవేశించి మరో 5,000 హెక్టార్లకు నష్టం వాటిల్లింది. రేపల్లెలో తూటుకాడ, గుర్రపుడెక్క పేరుకుపోయి నీరు ప్రవహించే దారి లేక పంటపొలాలను ముంచెత్తి అపారం నష్టం వాటిల్లింది. డ్రైనేజీలు, పంటకాలువల మరమ్మతులకు ఒక్క రూపాయి నిధులు కూడా గత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం విడుదల చేసిన దాఖలాలు లేవు. పైగా గత ప్రభుత్వంలో వాగుల ఆధునీకీకరణకు ఆమోదం తెలిపిన ఫైళ్లను కూడా అటకెక్కించి రైతుల ప్రయోజనాల మీద చావుదెబ్బ కొట్టింది. కాలువల్లో, డ్రైనేజీల్లో తూటికాడ, గుర్రపుడెక్క వంటివి తొలగించే నామమాత్రపు పనులు కూడా ప్రభుత్వం చేపట్టలేదు.
Updated Date - 2023-12-08T07:06:06+05:30 IST