CID: చంద్రబాబు పీటీ వారెంట్ హాజరుపై ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు
ABN, First Publish Date - 2023-10-13T18:33:36+05:30
సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్ టేకింగ్‌తో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
అమరావతి: సుప్రీంకోర్టులో ఇచ్చిన అండర్ టేకింగ్‌తో విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పీటీ వారెంట్‌పై హాజరును 16వ తేదీ నుంచి 18వ తేదీకి వాయిదా వేయాలని అభ్యర్థించారు. సుప్రీంకోర్టులో ఏపీ అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ నుంచి వచ్చిన సమాచారం మేరకు మెమో ఫైల్ చేస్తున్నట్టు సీఐడీ పేర్కొంది. ఇప్పటికే ఈ నెల 16వ తేదీన చంద్రబాబును ఫైబర్ గ్రిడ్ కేసులో తన ఎదుట హాజరుపరచాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. 17వ తేదీ వరకూ అరెస్ట్ చేయబోమని పేర్కొన్న ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు అండర్ టేకింగ్, వెంటనే విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. చంద్రబాబు తరపు న్యాయవాదులకు సీఐడీ న్యాయవాది వెంటనే నోటీసులు కూడా అందచేశారు. మెమోని పరిశీలించిన తరువాత రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కు ఏసీబీ కోర్టు సమాచారం పంపనుంది.
Updated Date - 2023-10-13T18:43:37+05:30 IST