Jagan Mohan Reddy: పథకాలపై సీఎం జగన్ సొంత డబ్బా..పవన్ పై మళ్లీ వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 29 , 2023 | 03:10 PM
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. భీమవరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పీడు పెంచారు. అనేక కార్యక్రమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ మోహన్ రెడ్డి భీమవరంలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ఏపీలో తోడేళ్లు అంతా ఏకమై మీ జగన్ తో పోరాటం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావిస్తూ అతను ప్యాకేజీల కోసమే పని చేస్తారని ఆరోపించారు. ప్యాకేజీల కోసం అతను ఏదైనా చేస్తారని అన్నారు. నిజ జీవితంలో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోకూడా నాలుగేళ్లు కూడా కాపురం చేయలేడని విమర్శించారు. అంతేకాదు అతను ఆడవారిని కేవలం ఆటవస్తువుగా మాత్రమే చూస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ విధంగా అనేక పెళ్లిళ్లు చేసుకుని పవిత్రమైన వివాహ వ్యవస్థ సంప్రదాయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని సీఎం జగన్ గుర్తు చేశారు.
ఇక చంద్రబాబు గురించి గుర్తు చేసిన జగన్ బాబు మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. బాబు ఇంతకు ముందు మ్యానిఫెస్టోలో ఆరు అంశాలన్నాడు. ఇప్పుడు ఉమ్మడి మ్యానిఫెస్టో అంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. 75 ఏళ్ల పెద్ద మనిషి రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని జగన్ ప్రశ్నించారు. ఈ క్రమంలో కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామం తీసుకున్నా కూడా మన ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పును చూడాలని ప్రజలను కోరారు.
దీంతోపాటు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రస్తావించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం ద్వారా ఎంత మేలు జరుగుతుందో సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత డబ్బా కొట్టారు. అంతేకాదు ఇవన్నీ చేయని చంద్రబాబు వీటి గురించి మాట్లాడుతుంటే ఆయనకు కడుపు మండుతుందని అన్నారు. ఈ క్రమంలో భీమవరం ఎంమ్మెల్యే అభ్యర్థిగా గ్రంధి శ్రీనివాస్ కు దాదాపు టికెట్ ఖరారు చేేసినట్లు చెప్పారు.
Updated Date - Dec 29 , 2023 | 03:14 PM