Bandar Port: వివాదాస్పదంగా బందరు పోర్టు ఆహ్వాన పత్రికలు
ABN, First Publish Date - 2023-05-21T18:52:48+05:30
వివాదాస్పదంగా బందరు పోర్టు (Bandar Port) ఆహ్వాన పత్రికలు మారాయి. సోమవారం సీఎం జగన్ (CM Jagan) చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తారు.
అమరావతి: వివాదాస్పదంగా బందరు పోర్టు (Bandar Port) ఆహ్వాన పత్రికలు మారాయి. సోమవారం సీఎం జగన్ (CM Jagan) చేతుల మీదుగా పోర్టు పనులు ప్రారంభిస్తారు. అయితే బందరు పోర్టు ఆహ్వాన పత్రికలు రెండు రకాలుగా ముద్రించారు. రెండు ఆహ్వాన పత్రికలు వివాదంగా ఎందుకు మారాయంటే.. ఒక ఆహ్వాన మచిలీపట్నం వైసీపీ శాఖ తరుపున ముద్రించారు. మరొకటి జిల్లా కలెక్టర్ పేరుతో ఆహ్వాన పత్రిక ముద్రించారు. అయితే రెండు ఆహ్వాన పత్రికల్లోనూ బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి (Vallabbhaneni Balashowry)కి ప్రధాన్యత ఇవ్వకపోవడం గమనార్హం. ఎంపీ స్థాయిని తక్కువ చేసేలా ఫొటో, పేరు ముద్రించారు. పార్టీ పరంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో చిన్నపాటి ఫోటోకే ఎంపీ బాలశౌరిని పరిమితం చేశారు. ఎమ్మెల్యే పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టును హైలెట్ చేస్తూ పార్టీ ఆహ్వాన పత్రికలో ముద్రించారు. అధికారిక ఆహ్వాన పత్రికలో ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ పేరు ముద్రణకు నోచుకోలేదు. విశిష్ట అతిథుల పేర్లలో చివరి పేరుగా ఎంపీ పేరు ముద్రంచారు. అదికూడా నగర మేయర్ పేరు కింద ఎంపీ పేరు ముద్రించారు.
అనుమానాలు
2009 ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగడానికి ఏడాది ముందు, 2008 ఏప్రిల్ 23న బందరు పోర్టుకు నాటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం సాగలేదు. 2019 ఫిబ్రవరి 7న నవ్యాంధ్ర సీఎం హోదాలో చంద్రబాబు బందరు పోర్టుకు శంకుస్థాపన చేశారు. ఈసారి అంతా సక్రమంగా సాగేదే. కానీ... వైసీపీ సర్కారు దీనినీ ‘రివర్స్’ బాట పట్టించింది. ఇప్పుడు... ఎన్నికల ఏడాదిరాగానే మళ్లీ బందరు పోర్టు పేరిట హడావుడి మొదలుపెట్టింది. సోమవారం బందరు పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు ప్రస్తుత సీఎం జగన్ సిద్ధమవుతున్నారు. ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి.
ఇప్పుడు పనులు ప్రారంభించినట్టుగా చూపినా, ఏదైనా కారణంగా పనులు ఆలస్యంగా ప్రారంభిస్తే, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారితే పోర్టు పనుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నగా మారింది. పోర్టు పనులను దక్కించుకున్న మెఘా సంస్థ ఇప్పటివరకు పోర్టు పనులను ఎక్కడా చేయలేదు. వివిధ ప్రాంతాల్లో భారీ నిర్మాణాలు చేసినా పోర్టు పనులు చేయడం ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఎంతవరకు మెఘాసంస్థ పోర్టు పనులను చేస్తుందనేది అనుమానంగా ఉంది.
Updated Date - 2023-05-21T18:52:48+05:30 IST