TTD: తిరుమలలోభక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటలు
ABN, First Publish Date - 2023-04-08T20:18:19+05:30
తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు భక్తుల (Devotees) రాక మొదలైన విషయం తెలిసిందే.
తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల నేపథ్యంలో శుక్రవారం ఉదయం నుంచే తిరుమలకు భక్తుల (Devotees) రాక మొదలైన విషయం తెలిసిందే. శనివారం కూడా తిరుమల కొండ భక్తులతో కిక్కిరిసింది. శ్రీవారి ఆలయం, వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లు, మాడవీధులు, కొబ్బరికాయలు సమర్పించే అఖిలాండం, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాద భవనం, బస్టాండ్, యాత్రికుల వసతి సముదాయాలు, రోడ్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయి క్యూలైన్ శిలాతోరణం వరకు వ్యాపించింది. వీరికి దాదాపు 30 గంటల దర్శన సమయం పడుతోంది. టైంస్లాట్ టికెట్లు (Timeslot tickets), టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతోంది. మరోవైపు గదులకు డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఓ గది పొందేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది.
టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులే తిరుమలకు రండి
వరుస సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరిగిందని, భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ (TTD) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. సర్వదర్శనానికి దాదాపు 30 గంటల దర్శన సమయం పడుతున్నట్టు పేర్కొంది. అధిక రద్దీ కారణంగా రూ.300 దర్శన టికెట్లు, ఎస్‌ఎస్‌డీ, దివ్యదర్శన టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమలకు రావాలని విజ్ఞప్తి చేసింది. ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) ఆదేశాల మేరకు జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలు, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు 50వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.
Updated Date - 2023-04-08T20:18:19+05:30 IST