AP News: 20 రోజులుగా రైతులను కన్నెత్తి చూడని అధికారులు.. చంద్రబాబు రాకతో...
ABN, First Publish Date - 2023-05-06T11:00:24+05:30
రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షానికి పంటలు నష్టపోయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు.
తూర్పుగోదావరి: రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షానికి పంటలు నష్టపోయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. తడిసిన ధాన్యాన్ని తరలించాలని రైతులు వేడుకున్నప్పటికీ కుంటిసాకులు చెబుతూ తప్పించుకున్నారు. రైతుల ఆవేదనను పట్టించుకోని పరిస్థితి. అయితే గత రెండు రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) జిల్లాలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా వర్షం కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ తమ తప్పులు భయటపడతారని భావించారో ఏమో... హుటాహుటిన అధికారులు చర్యలు చేపట్టారు. చంద్రబాబు రాకతో జిల్లా యంత్రాంగంలో కదలిక వచ్చింది. నిడదవోలు మండలం తీరుగూడెంలో తడిసిన ధాన్యాన్ని హుటాహుటిన తరలిస్తున్న పరిస్థితి. గత రాత్రి నుంచి రైతులను మభ్యపెడుతూ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తోలుతున్న వైనం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిన్నటి వరకు కదలని యంత్రాంగం.. చంద్రబాబు రాకతో రాత్రికి రాత్రి చర్యలు చేపట్టింది. గత 20 రోజుల నుంచి రైతులను అధికారులు కన్నెత్తి చూడని పరిస్థితి. నిన్నటి వరకు గోనె సంచులు, ట్రాన్స్‌పోర్టు లారీలు, ట్రాక్టర్లు దొరకలేదంటూ రైతులను అధికారులు మభ్య పెడుతూ వచ్చారు. అయితే ఉన్నట్టుండి రైతు భరోసా కేంద్ర సిబ్బంది, వాలంటీర్లు దగ్గరుండి మరీ గత రాత్రి నుంచే ధాన్యాన్ని తరలిస్తున్నారు. ఎంత వేడుకున్నా పట్టించుకోని అధికారులు.. హుటాహుటిన చర్యలు చేపట్టడంతో ఆశ్చర్యపోవడం రైతుల వంతైంది.
పర్యటనలో మార్పు...
మరోవైపు చంద్రబాబు నిడదవోలు పర్యటనలో మార్పులు చోటు చేసుకున్నాయి. నిడదవోలు మండలం కంసాలి పాలెం, తీరుగూడెం, సింగవరం గ్రామాలలో పర్యటన రద్దు అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈరోజు కాటకోటేశ్వరం, సమిశ్రగూడెం గ్రామాలలో రైతులను చంద్రబాబు కలవనున్నారు.
Updated Date - 2023-05-06T11:00:36+05:30 IST