TDP Leaders: టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు.. ఖాకీల కళ్లుగప్పి మరీ దేవినేని..
ABN, First Publish Date - 2023-06-10T11:12:11+05:30
పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం ఉదయం తెలుగుదేశం నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమ, నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు బడేటి చంటి,
తూర్పుగోదావరి: పోలవరం ప్రాజెక్టు సందర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. శనివారం ఉదయం తెలుగుదేశం నేతలు మాజీ మంత్రి దేవినేని ఉమ (Former Minister Devineni Uma), నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జులు బడేటి చంటి (Badeti Chanti), మద్దిపాటి వెంకటరాజు (Maddipati Venkata raju), గన్ని వీరాంజనేయులు (Ganni Veeranjaneyulu), ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు (MLA Nimmala Ramanaidu) తదితరులు పోలవరం ప్రాజెక్ట్ వద్దకు బయలుదేరారు. అయితే గోపాలపురం మండలం కొవ్వూరు పాడు శివారులో టీడీపీ బృందాన్ని గోపాలపురం పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలవరం సందర్శనకు వెళ్లి తీరుతామని టీడీపీ నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు టీడీపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అయితే మాజీ మంత్రి దేవినేని ఉమ పోలీసుల కన్నుగప్పి మోటార్ సైకిల్‌పై పోలవరం ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్లారు. అదుపులోకి తీసుకున్న నాయకులను గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు పోలీసులు తరలిస్తున్నారు. అయితే పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కమిషన్ల కక్కుర్తితో పోలవరాన్ని నాశనం చేసిన జగన్ రెడ్డి ప్రాజెక్టులో వైఫల్యాలు బయటపడతాయనే తమను అడ్డుకుంటున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో లక్షలాది మంది ప్రజలు ప్రాజెక్టును సందర్శించి నిర్మాణాలను పరిశీలించారని.. తాము ప్రాజెక్టుకు వెళ్తామంటే వైసీపీ సర్కార్ ఎందుకు భయపడుతోందని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
దేవినేని ఉమా అరెస్ట్..
కాగా... పోలీసులు కళ్లుగప్పి వెళ్తున్న మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలవరం వెళ్తున్న టీడీపీ నేతల బృందాన్ని ప్రగడపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసుల నుంచి తప్పించుకొని ద్విచక్ర వాహనంపై కాలువ గట్టు మీదగా పోలవరం వద్దకు దేవినేని ఉమా చేరుకున్నారు. పోలవరం ప్రధాన ద్వారం వద్ద మళ్లీ దేవినేని ఉమను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Updated Date - 2023-06-10T11:53:25+05:30 IST