Weather Report: అల్పపీడనం.. రుతుపవనాల విస్తరణ
ABN, First Publish Date - 2023-06-24T20:05:06+05:30
ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది.
విశాఖపట్నం: ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడనున్నదని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇది తరువాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ వైపు వెళ్లనున్నదని అంచనా వేసింది. కాగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతోపాటు ఉత్తరప్రదేశ్‌లో మరో ఆవర్తనం, కేరళ నుంచి కర్ణాటక వరకు అరేబియా సముద్ర తీరంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో శనివారం కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్ర, అరేబియా సముద్రం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, హరియాణా, జమ్ము కశ్మీర్, లడక్ వరకూ రుతుపవనాలు విస్తరించాయి.
రానున్న రెండు రోజుల్లో ముంబై, ఢిల్లీతోపాటు, దేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలావుండగా రాష్ట్రంలో శనివారం అనేక ప్రాంతాల్లో మేఘాలు ఆవరించి వాతావరణం చల్లబడగా, అనేకచోట్ల ఒక మోస్తరు నుంచి భారీవర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం తిరుపతి, అనంతపురంలో 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
Updated Date - 2023-06-24T20:05:06+05:30 IST