Medical students: క్లాస్ రూమ్‌లో ఎంబీబీఎస్ స్టూడెంట్ ఏం చేస్తున్నారో చూడండి!
ABN, First Publish Date - 2023-11-22T04:38:22+05:30
మెడికల్ విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. క్లాస్ రూమ్‌లోనే రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఆ తర్వాత రోడ్డుపైనా దాడులకు దిగారు. రక్తం కారేలా కొట్టుకున్నారు.
గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణతో వివాదం
ఒంగోలు రిమ్స్‌లో ఆరునెలలుగా అంతర్గత పోరు
క్లాస్‌రూములో బాహాబాహీ.. రోడ్డుపైనా దాడులు
వీధిరౌడీల్లా ప్రవర్తించిన ఎంబీబీఎస్ విద్యార్థులు
ఒంగోలు (కార్పొరేషన్), నవంబరు 21: మెడికల్ విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. క్లాస్ రూమ్‌లోనే రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఆ తర్వాత రోడ్డుపైనా దాడులకు దిగారు. రక్తం కారేలా కొట్టుకున్నారు. గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో... ఒంగోలులోని రిమ్స్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ‘గ్యాంగ్ వార్’ తీవ్ర సంచలనం రేపింది. రిమ్స్ మెడికల్ కాలేజిలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం (2020-21 బ్యాచ్) చదువుతున్న విద్యార్థుల మధ్య ఏడాది కాలంగా డ్రగ్ వార్ నడుస్తున్నట్టు సమాచారం. క్లాస్‌లోని ఓ తొమ్మిది మంది విద్యార్థులు తరచుగా గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ విషయం తెలిసిన సహచర విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్లాస్‌లో మిగిలిన వారికి ఇబ్బంది కలిగించొద్దని సూచించారు. ఆరునెలల క్రితం కాలేజీలో ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ కమిటీని నియమించగా.. ఆ తొమ్మిది మంది గంజాయి తాగుతున్నారని రుజువైనట్లు సమాచారం.
ఈ క్రమంలో అప్పటి కళాశాల ప్రిన్సిపాల్ వారిని హాస్టల్ నుంచి బహిష్కరించారు. దీంతో వారు బయట వేరుగా రూము తీసుకుని కాలేజీకి వస్తున్నారు. అప్పటి నుంచి ఈ తొమ్మిది మందికీ, మిగతా వారికీ మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మరోసారి తరగతి గదిలో మాటామాటా పెరిగడంతో ఫిర్యాదు చేసిన విద్యార్థులపై వారు దాడికి దిగారు. ఈ గొడవ అంతటితో సద్దుమణగకపోగా.. దాడిలో గాయపడిన ఒకరిద్దరు విద్యార్ధులు సాయంత్రం 7 గంటల సమయంలో రిమ్స్ ఆస్పత్రి ఎదురుగా ఉన్న మెడికల్ షాపులో మందులు కొనేందుకు వెళ్లగా అక్కడ కూడా నడిరోడ్డుపై వారిమీద దాడికి పాల్పడ్డారు. ఆ దాడి నుంచి తప్పించుకున్న యశ్విద్ అనే విద్యార్థితోపాటు మరికొందరు దక్షిణ బైసాప్ రోడ్‌లో టీ తాగేందుకు వెళ్లగా గంజాయి బ్యాచ్ అక్కడ కూడా మరోసారి దాడికి పాల్పడింది. ఈసారి బాధిత విద్యార్థులు ఎదురు తిరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారి.. జాతీయ రహదారి రణరంగాన్ని తలపించింది. ఈ దాడిలో యశ్విద్ తలకు తీవ్ర గాయమై రక్తం కారడంతో అతన్ని రిమ్స్‌కు తరలించారు. యశ్విద్ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
గంజాయి వినియోగం వాస్తవమే: రిమ్స్ ప్రిన్సిపాల్
మెడికల్ కాలేజీ విద్యార్థులు గొడవలు పడడం తన దృష్టికి వచ్చిందని ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. ఏడుకొండలరావు వివరించారు. తాను బాధ్యతలు చేపట్టి వారం రోజులే అవుతోందని, అయితే తనతోపాటు వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వెంకటరమణ ఈ దాడి ఘటనపై విచారణ చేశామని తెలిపారు. విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు గతంలోనే వీరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందని చెప్పారు. అందుకు కారణాలను పరిశీలిస్తే కొందరు గంజాయి తీసుకుంటున్నారని గతంలో నిర్ధారణ అయినట్టు తెలిసిందన్నారు. ఆరోపణలు ఎదుర్కొన్న విద్యార్థులు ఒకటి, రెండు సార్లు తనను కలిసి హాస్టల్‌లోకి అనుమతించాలని కోరినా తాను అంగీకరించలేదన్నా రు. అయితే ఇరువర్గాలు భవిష్యత్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని వారికి కౌన్సెలింగ్ ఇచ్చామని, తాను మాత్రం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు.
కర్నూలు మెడికల్ కళాశాలలో గంజాయి కలకలం
హాస్టల్‌లో నలుగురు విద్యార్థుల వద్ద గుర్తింపు
హాస్టల్, వైద్యాధికారుల తనిఖీల్లో వెలుగులోకి
కర్నూలు (హాస్పిటల్), నవంబరు 21: కర్నూలు మెడికల్ కళాశాల మెన్స్ హాస్టల్‌లో గంజాయి పట్టుబడటం మంగళవారం కలకలం రేపింది. మెడికోలు ఇటీవల మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు రావడంతో ఈ నెల 17, 18వ తేదీల్లో హాస్టల్ డిప్యూటీ వార్డెన్, అసిస్టెంట్ వార్డెన్‌లు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ గదిలో నలుగురు వైద్య విద్యార్థులు మద్యం సేవిస్తూ గంజాయి తాగుతూ కనిపించారు. వారిలో ఇద్దరు విద్యార్థుల పాత్ర ప్రధానంగా ఉన్నట్లు తెలిసింది. గంజాయిని పొడిచేసి దాన్ని పొగ రూపంలో తీసుకుంటున్నట్టు అధికారులు గుర్తించారు. గంజాయి ఘటన వెలుగులోకి రావడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించిన ప్రిన్సిపాల్, అధికారులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. కాగా, దీనిపై ప్రిన్సిపాల్ ముగ్గురితో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేయగా.. ఈ కమిటీ సభ్యులు మంగళవారం మెన్స్ హాస్టల్‌లో విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడ నుంచి వచ్చింది.. ఎవరు ఇచ్చారంటూ విద్యార్థులను ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ చరిత్రలో మొదటిసారిగా మాదకద్రవ్యాలు పట్టుబడటం.. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - 2023-11-22T12:22:01+05:30 IST