Tirumala Darsan: తిరుమలకు నడకమార్గంలో వెళ్లే భక్తులకు శుభవార్త
ABN, First Publish Date - 2023-03-27T17:37:52+05:30
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి (Lord Balaji Darsan) దర్శనార్థం తిరుమలకు (Tirumala) కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం..
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి (Lord Balaji Darsan) దర్శనార్థం తిరుమలకు (Tirumala) కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) (TTD) శుభవార్త చెప్పింది. మూడేళ్ల తర్వాత దివ్య దర్శన టోకెన్లను టీటీడీ పునరుద్ధరించింది. కాలినడకన వెళ్లే భక్తులకు అలిపిరి మార్గంలో (Alipiri Route) 10 వేలు, శ్రీవారి మెట్టు మార్గంలో 5 వేల దివ్య దర్శన టోకెన్లను జారీ చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సోమవారం నాడు ప్రకటించారు. ఏప్రిల్ నుంచి దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
వేసవి రద్దీ దృష్ట్యా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు తరలివెళ్లే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వైవీ వెల్లడించారు. 3 నెలల పాటు ప్రజా ప్రతినిధులు సిఫార్సు లేఖలు జారీ చేయవద్దని టీటీడీ చైర్మన్ అభ్యర్థించారు. తిరుమలపై 40 వేల మంది భక్తులకు మాత్రమే వసతి సౌకర్యం ఉందని, 80% గదులను సామాన్య భక్తులకే కేటాయిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ, కల్యాణకట్ట సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. మరో కీలక పరిణామం ఏంటంటే.. రూ.300 శ్రీవారి దర్శన టికెట్లను టీటీడీ సోమవారం విడుదల చేసింది. ఏప్రిల్ కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయడం గమనార్హం. ఇక.. భక్తుల రద్దీ విషయానికొస్తే.. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి 5 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుండటం గమనార్హం. ఆదివారం నాడు శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.86 కోట్లుగా లెక్క తేలింది. ఆదివారం నాడు శ్రీవారిని 79,415 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,454 మంది భక్తులు తల నీలాలు సమర్పించి ఆ శ్రీనివాసుడిని దర్శనం చేసుకున్నారు.
Updated Date - 2023-03-27T17:37:56+05:30 IST