Guntur: రాక్షస క్రీడను రాష్ట్రం నుంచి పారదోలాలి: కన్నా లక్ష్మీనారాయణ
ABN, First Publish Date - 2023-02-23T16:10:17+05:30
గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం మధ్యాహ్నం టీడీపీ (TDP)లో చేరారు.
గుంటూరు: మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం మధ్యాహ్నం టీడీపీ (TDP)లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కండువా కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఏపీలో రాక్షస పాలన కొనసాగుతోందని, రాక్షస క్రీడను రాష్ట్రం నుంచి పారదోలాలని, రాష్ట్రంలోని ప్రజాస్వామ్యవాదులు అందరూ కలిసిరావాలని కన్నా పిలుపిచ్చారు.
ఒక్క అవకాశం ఇస్తే తన తండ్రి వైఎస్ (YS)ను మరిపిస్తానంటే ప్రజలు నమ్మి.. జగన్ (Jagan)కు ఓట్లు వేసి అధికారం ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ సొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజల సంక్షేమం గురించి అసలు ఆలోచన చేయడం లేదని, చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ ఎత్తుకెళ్లిన చందంగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు.
భారతి సిమెంట్ (Bharti Cement) నుంచి సీఎం జగన్ డబ్బులు తేవడం లేదని, ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ప్రజల ఆస్తులను అమ్మి తెచ్చిన డబ్బు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్.. అమరావతి (Amaravathi) రాజధానికి మద్దతు తెలిపి.. అధికారంలోకి రాగానే మూడు రాజధానులు అంటున్నారని మండిపడ్డారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్నినాశనం చేస్తున్నారన్నారు. జగన్ పాలనలో ప్రజలకు భవిష్యత్ లేకుండా పోతోందని కన్నా ఆవేదన వ్యక్తం చేశారు.
విశాఖపట్నంలో వైసీపీ నేతలను (YCP Leaders) చూస్తే ప్రజలు భయపడుతున్నారని, జగన్ అనే ఈ రాక్షసుడిని తరిమి కొట్టాలనే తాను టీడీపీలో చేరానని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బీజేపీలో ప్రధాని మోదీ (PM Modi) నాయకత్వంలో బాగా పని చేస్తున్నా... ఏపీ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే టీడీపీలో చేరానన్నారు. అమరావతి రాజధానిగా, భవిష్యత్తు తరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నానని కన్నా స్పష్టం చేశారు.
Updated Date - 2023-02-23T16:47:34+05:30 IST