Bopparaju: సీఎఫ్‌ఎంఎస్ ఉద్యోగుల పాలిట ఉరితాడు: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ABN, First Publish Date - 2023-04-12T21:58:42+05:30
సీఎఫ్‌ఎంఎస్ (CFMS) ఉద్యోగుల పాలిట ఉరితాడుగా మారిందని ఏపీ జేఏసీ అమరాతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆందోళన వ్యక్తం చేశారు.
విజయనగరం: సీఎఫ్‌ఎంఎస్ (CFMS) ఉద్యోగుల పాలిట ఉరితాడుగా మారిందని ఏపీ జేఏసీ అమరాతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateshwarlu) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానం వల్ల ఉద్యోగులు అందోళన చెందుతున్నారని, వెంటనే దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎఫ్‌ఎంఎస్ వల్ల ఒకరి చేతితో బటన్ నొక్కితేతప్ప పైసా కూడా విడుదల కాదని చెప్పారు. ఉద్యోగులు ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై తొలిదశ ఉద్యమం గత నెల 9న మొదలుపెట్టి 30వ తేదీ వరకు చేపట్టినా ప్రభుత్వం పరిష్కారం చూపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము దాచుకున్న డబ్బులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని విమర్శించారు. డీఏ ఎంత రావాలి? పీఆర్సీ అరియర్స్ (PRC Arrears) ఎంత చెల్లించాలి? అని ప్రశ్నించారు. కొంతమంది ఉద్యోగుల జీతాలు వేస్తున్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని బొప్పరాజు ఆరోపించారు. ఉద్యోగుల ఆర్థికపరమైన ఆంశాలపై సృష్టత ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకే లెక్కలు చెప్పకపోతే ప్రజలకు ఏం చెబుతారని ప్రశ్నించారు. వెంటనే ఆర్థికపరమైన లెక్కలు చెప్పాలని బొప్పరాజు డిమాండ్ చేశారు.
కమిషన్ సిపార్సు చేసిన పీఆర్సీ పేస్కేల్ ఇప్పటికీ ఇవ్వలేదని గుర్తు చేశారు. పొరుగునే ఉన్న తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) ఇస్తున్న పేస్కేల్ ఇక్కడ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అక్కడ డీఏ, అరియర్స్ ఉద్యోగులకు చెల్లించారని, ఇక్కడ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్య, వైద్య శాఖల్లో పనిచేసే కొంతమంది ఉద్యోగులకు గత ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీజీఎల్‌ఐ లెక్కలు ఫైనాన్స్ డిపార్డుమెంట్ తేల్చాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉద్యోగాల సంఘాల నాయకులతో కలిసి ముందుకు వెళ్తామని చెప్పారు. ఈనెల 18న ఉపాధ్యాయుల సమస్యలపైన, 25న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలుపైన, 29న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై ధర్నా చేస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
Updated Date - 2023-04-12T21:58:42+05:30 IST