Bala Kotireddy: బాలకోటిరెడ్డి అంత్యక్రియల్లో పోలీసుల కవ్వింపు చర్యలు
ABN, First Publish Date - 2023-02-22T16:00:11+05:30
టీడీపీ పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి (Venna Bala Kotireddy) అంత్యక్రియల్లో పోలీసుల కవ్వింపు చర్యలకు దిగారు.
పల్నాడు: టీడీపీ పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డి (Venna Bala Kotireddy) అంత్యక్రియల్లో పోలీసుల కవ్వింపు చర్యలకు దిగారు. నరసరావుపేట టీడీపీ ఆఫీస్ నుంచి ఆలవాలకు టీడీపీ నేతలు (TDP leaders) ర్యాలీగా బయల్దేరారు. అయితే ర్యాలీ జరగకుండా అడ్డంకులు సృష్టించేందుకు పోలీసుల ప్రయత్నించారు. బాలకోటిరెడ్డి అంతిమయాత్రను నరసరావుపేట టౌన్ (Narasaraopeta Town)లోకి రాకుండా.. నేరుగా ఆలవాలకు తీసుకెళ్లాలని పోలీసులు ఆదేశించారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట బైపాస్ దగ్గర టీడీపీ నేతల ఆందోళనకు దిగారు. నరసరావుపేట నుంచి ర్యాలీగా వెళ్లాల్సిందేనంటూ నినాదాలు చేశారు.
ప్రత్యర్థుల తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బాల కోటిరెడ్డి (72) చికిత్స పొందుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఈ నెల 2వ తేదీన ప్రత్యర్థులు ఆయనపై కాల్పులు జరిపారు. గాయపడిన ఆయనకు నరసరావుపేటలో చికిత్స అందించారు. మూడురోజుల కిందట పరిస్థితి విషమించటంతో గుంటూరులోని రమేశ్ ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ చికిత్స పొందుతూ బాలకోటిరెడ్డి మృతి చెందారు. పలువురు టీడీపీ నాయకులు బాలకోటిరెడ్డి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయనపై దాడి జరిగిన రోజు నుంచి గ్రామంలో పోలీసు పికెట్‌ను ఏర్పాటు చేశారు.
బాల కోటిరెడ్డి గతంలో రొంపిచర్ల ఎంపీపీగా, ఆయన భార్య గ్రామ సర్పంచ్‌గా సేవలు అందించారు. ఆరు నెలల కిందట ఆయనపై గ్రామానికి చెందినవారే గొడ్డలితో దాడి చేశారు. ఆ గాయాల నుంచి కోలుకుని, మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపారు. అలవాల గ్రామానికి చెందిన పమ్మి వెంకటేశ్వరరెడ్డి కాల్పులకు సూత్రధారి. ఈ కేసులో పూజల రాములు, పులి అంజిరెడ్డి, వంటిపులి వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.
Updated Date - 2023-02-22T16:00:12+05:30 IST