ఎమ్మెల్సీ ఏకగ్రీవ ఎన్నికకు బ్రేక్.. బెడిసికొట్టిన వైసీపీ వ్యూహం.. టీడీపీ ప్లాన్ సూపర్..!
ABN, First Publish Date - 2023-02-23T20:09:02+05:30
టీడీపీ (TDP) తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ (Nomination) వేయకుండా అడ్డుకునేందుకు అధికార వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది.
ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ అన్నీ స్థానాల్లో గెలవాలనే అడ్డదారులన్నీ తొక్కుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడా ఏ పార్టీ అభ్యర్థీ తమకు అడ్డురాకుండా ఉండాలని ఏకగ్రీవమే టార్గెట్‌గా ప్లాన్‌లు చేసుకుంది వైసీపీ. అయితే ఎన్ని ప్లాన్‌లు చేసినా.. అంతకుమించి వ్యూహాలు రచించినా అన్నీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. అనంతపురం జిల్లాలో జరిగిన ఘటనే ఇందుకు సాక్ష్యం. వైసీపీ తరఫున స్థానిక సంస్థల అభ్యర్థి బోయ మంగమ్మతో అనంతపురం జిల్లా నేతలు నామినేషన్ వేయించారు. ప్రత్యర్థులు ఎవరూ నామినేషన్ వేయకపోవడం.. ఆ సాహసం కూడా ఎవరూ చేయకపోవడంతో ఇక ఏకగ్రీవమేనని తెగ సంబరపడిపోయారు. తీరా చూస్తే.. ఎవరూ ఊహించని రీతిలో టీడీపీ అభ్యర్థి ఏలూరు రంగయ్య నామినేషన్ వేయడంతో వైసీపీ ప్లాన్ మొత్తం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఒక్క మాటలో చెప్పాలంటే సినీ ఫక్కీలో వెళ్లి నామినేషన్ వేశారు. ఇంతకీ అనంతపురంలో అసలేం జరిగింది..? వైసీపీ ఇంత నాటకం ఎందుకు ఆడిందనే దానిపై ప్రత్యేక కథనం.
టీడీపీ (TDP) తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ (Nomination) వేయకుండా అడ్డుకునేందుకు అధికార వైసీపీ విశ్వప్రయత్నాలు చేసింది. అయినా టీడీపీ వెనక్కు తగ్గలేదు. సినీఫక్కీలో వైసీపీ శ్రేణుల కంటపడకుండా టీడీపీ అభ్యర్థి కలెక్టరేట్ వెనుకదారి నుంచి లోపలికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని ఏకగ్రీవం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ... టీడీపీ నేతల పక్కా ప్రణాళికతో వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం ఆఖరు రోజు కావడంతో... టీడీపీ తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ఏకంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, శంకర్‌నారాయణ (Topudurthi Prakash Reddy Shankarnarayana) పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, మరికొందరు ముఖ్య నేతలు రంగంలోకి దిగారు.
తమ అనుచరులను కలెక్టరేట్ ఎదుట మోహరించారు. టీడీపీ అభ్యర్థితో పాటు మద్దతుదారులు ఎటువైపు నుంచి వస్తారోనని రోడ్లపై కాపుకాశారు. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని పోలీసుల్లా తనిఖీ చేశారు. నామినేషన్ వేసేందుకు సమయం మరో అరగంట ఉందనగా... టీడీపీ తరుఫున యాడికి మాజీ ఎంపీపీ, జేసీ సోదరుల ముఖ్య అనుచరుడు వేలూరు రంగయ్య నాటకీయంగా వచ్చారు. తలపై ముస్లిం టోపీ ధరించి, నామినేషన్ పత్రాలను చొక్కాలో దోపుకొని, ఎవరూ గుర్తు పట్టకుండా కలెక్టరేట్ వెనుకవైపు ప్రహారీ దూకి లోపలికి చేరుకున్నారు. రంగయ్య మద్దతుదారులుగా తాడిపత్రి మున్సిపాల్టీకి చెందిన కొందరు కౌన్సిలర్లు కలెక్టరేట్ ప్రధాన ద్వారం ద్వారా లోపలికి వెళ్లి, ఎన్నికల అధికారి, జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ కేతన్‌గార్గ్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు.
కలెక్టరేట్ చుట్టూ కాపలా..
టీడీపీ తరుఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ పడకుండా, ఏకగ్రీవం చేసుకోవాలని అధికార పార్టీ ప్రయత్నించింది. గురువారం ఉదయం నుంచే ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులతో కలెక్టరేట్ ఎదుట మకాం వేశారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడారు. నామినేషన్ వేసే అభ్యర్థుల జాబితాను ఆయన పరిశీలించారు. ఎవరెవరు ఏ ఏ స్థానానికి నామినేషన్ వేయడానికి టోకెన్ తీసుకున్నారో అడిగి కనుక్కున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టీడీపీ అభ్యర్థి అప్పటికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో... అక్కడే కొద్దిసేపు ఉన్నారు. అంతలో మరో ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య, స్థానిక సంస్థల అభ్యర్థి బోయ మంగమ్మతో పాటు ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేల డైరెక్షన్‌లో ఆ పార్టీ శ్రేణులు కలెక్టరేట్ చుట్టూ పహారాకాశారు. టీడీపీ అభ్యర్థి, ఆయన మద్దతుదారులు ఆ దారిగుండా వస్తారేమోనని కాపుకాశారు.
ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా కలెక్టరేట్‌కు వందమీటర్ల దూరంలో ఉండాలని పోలీసులు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఆ పార్టీ శ్రేణులను అక్కడి నుంచి పంపించేశారు. టీడీపీ అభ్యర్థి తాడిపత్రి ప్రాంతవాసి కావడంతో... ఆ దారిగుండా వస్తాడని భావించి, తాడిపత్రి-అనంతపురం ప్రధాన రహదారిపై బుక్కరాయసముద్రం వద్ద ఓ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అధికారపార్టీ శ్రేణులు వాహనాలను తనిఖీ చేశారు. టీడీపీ అభ్యర్థి నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంతకు బరితెగించారో దీన్నిబట్టి అర్థమవుతోంది. కలెక్టరేట్ వద్ద దాదాపు నాలుగు గంటల పాటు హై డ్రామా చోటుచేసుకుంది.
Updated Date - 2023-02-23T21:05:15+05:30 IST