Jagan: జగన్ సభలో జైబాలయ్య నినాదాలు
ABN, First Publish Date - 2023-01-30T19:47:07+05:30
జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా సోమవారం వినుకొండ (Vinukonda)కు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) వచ్చారు.
వినుకొండ: జగనన్న చేదోడు కార్యక్రమంలో భాగంగా సోమవారం వినుకొండ (Vinukonda)కు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan Mohan Reddy) వచ్చారు. పట్టణంలోని వెల్లటూరు రోడులోని బొల్లా బ్రహ్మనాయుడు ఎస్టేట్ వద్ద సభావేదిక ఏర్పాటు చేశారు. జూనియర్ కాలేజీ ఆవరణలోని హెలీప్యాడ్ (Helipad) నుంచి సభావేదిక వద్దకు ఉదయం 11.20గంటలకు జగన్ మోహన్‌రెడ్డి చేరుకొని 12.09గంటలకు తన ప్రసంగాన్ని ప్రారంభించి 12.43 నిమిషాలకు ముగించారు. సభాప్రాంగణంలో లోపలకు వెళ్లేందుకు గేట్లను ఏర్పాటు చేసి బయటకు రాకుండా పోలీసులు గేట్ల వద్దే ఉన్నారు. జగన్ మాట్లాడుతున్న సమయంలో గేట్ల నుంచి బయటకు రానివ్వకపోవడంతో హెల్త్ క్యాంప్ (Health Camp) పక్కన ఉన్న ఇనుప గేట్ల పైనుంచి యువకులు బయటకు దూకగా మిగతా వారు ఇనుప గేటు నెట్టివేసి బయటకు వెళ్లిపోవడం జరిగింది. సభా ప్రాంగణంలో హెల్త్ క్యాంప్ పక్కన ఉన్న గ్యాలరీలో జనం లేక వెలవెలబోయింది. హెలీప్యాడ్ నుంచి సభాప్రాంగణానికి వచ్చే దారిలో ప్రైవేటు పాఠశాలల విద్యార్థులచే ప్లకార్డులను ప్రదర్శించారు. బస్టాండ్ సమీపాన ఉన్న మరో ప్రైవేటు పాఠశాల విద్యార్థినీలు కూడా జగన్‌కు స్వాగతం పలకడానికి తరలిస్తుండగా వారు జైబాలయ్య అంటూ నినాదాలు చేయడం వారిలో బాలయ్యపై ఉన్న అభిమానానికి అద్దం పట్టింది.
సభకు వస్తే బిర్యాని... మందు
వినుకొండ సీఎం సభకు వచ్చిన వారికి వైసీపీ (YCP) ద్వితీయ శ్రేణి నాయకులు ఆయా గ్రామాల్లో జనసమీకరణ చేసి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం బిర్యాని, మందును అందజేసినట్లు సమాచారం. సభావేదిక వద్ద కొందరు మందుబాబులు మందు తాగడం కనిపించింది. జగన్ ప్రసంగం చేస్తుండగా మహిళలు వారికి కేటాయించిన వాహనాల్లో బిర్యాని ప్యాకెట్ల తీసుకొని వెళ్లిపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గ్రామాల్లో నుంచి వచ్చిన ప్రజలకు తప్ప సభావేదిక దగ్గరకు వచ్చిన మిగతా ప్రజలకు మంచినీరు కూడా లేక అవస్తలు పడ్డారు.
Updated Date - 2023-01-30T19:47:09+05:30 IST