YuvaGalam: 194వ రోజుకు యువగళం... వేంపాడు గ్రామ సమస్యలు విన్న లోకేశ్
ABN, First Publish Date - 2023-08-25T11:26:43+05:30
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokeshh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ (Young Leader) ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా యువనేతను వేంపాడు గ్రామస్తులు కలిశారు. నూజివీడు నియోజడకవర్గం గొల్లపల్లి శివారు వేంపాడు గ్రామస్తులు యువనేత లోకేశ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమ గ్రామ అగ్రహారంలో 3,356.23 ఎకరాల ఈనాం భూములు ఉన్నాయని.. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్లో 5 గ్రామాలకు చెందిన 1,350 మందికి చెందిన భూములు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. తమ గ్రామం నేటికీ సర్వే సెటిల్ మెంట్‌కు నోచుకోలేదని తెలిపారు. గ్రామ భూ సమస్యలపై స్థానికేతర భూస్వాములు సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడారని చెప్పారు. రైతులను ఇబ్బందులు పెడుతున్న జీఓలు 79, 102 లను రద్దు చేయించాలని కోరారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వేంపాడు గ్రామ భూ సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు వినతి చేశారు.
నారా లోకేష్ స్పందిస్తూ.. ఈనాం భూములకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సమస్యలున్నాయన్నారు. కేసులు కోర్టుల్లో ఉండి న్యాయపరమైన చిక్కుల కారణంగా దీర్ఘకాలంగా రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈనాం భూములకు సంబంధించి అధ్యయనం చేసి సముచితమైన నిర్ణయం తీసుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం మామిడి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో నారా లోకేశ్ పాల్గొననున్నారు.
Updated Date - 2023-08-25T11:26:43+05:30 IST