Vijayawada: డ్రైనేజీలో పడిన ఆరేళ్ల బాలుడు.. కొనసాగుతున్న గాలింపు
ABN, First Publish Date - 2023-05-05T14:50:06+05:30
నగరంలోని గురునానక్ కాలనీలో ఆరేళ్ల బాలుడు అభిరామ్ డ్రైనేజీలో పడిపోయాడు.
విజయవాడ: నగరంలోని గురునానక్ కాలనీలో ఆరేళ్ల బాలుడు అభిరామ్ డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. భారీ వర్షం కారణంగా డ్రైనేజీ పొంగిపొర్లుతోంది. ఈ క్రమంలో ఆడుకుంటూ బాలుడు అభిరామ్ ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయాడు. విషయం తెలిసిన స్థానికులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు డ్రైనేజీ పడటంపై స్థానికులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అధికారులపై కుటుంబీకులు, స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలను పూర్తిస్థాయిలో మూసివేయని కోరినప్పటికీ మున్సిపల్ అధికారులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. ఇలాంటి ఘటన రెండో సారి జరిగిందని స్థానికులు చెబుతున్నారు.
మరోవైపు విజయవాడలో గంట నుంచి భారీగా వర్షం కురుస్తోంది. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ళ లోతు నీళ్లతో బెజవాడ పొంగిపొర్లుతోంది. లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో మునిగిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు స్వల్ప అంతరాయం ఏర్పడింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై వర్షపు నీరు పొంగిపొర్లుతున్నాయి. బెంజ్ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, మొగల్రాజపురం, సూర్యారావుపేట, సింగ్ నగర్, పాయకపురం ప్రాంతాల్లో వర్షపునీరు రోడ్లపైకి వచ్చి చేరారు. రోడ్లపైకి వర్షపు నీరు భారీగా చేరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
Updated Date - 2023-05-05T16:15:59+05:30 IST