Bopparaju: సీఎస్‌కు ఉద్యమ కార్యాచరణ అందజేశాం...
ABN, First Publish Date - 2023-04-07T12:26:41+05:30
మలిదశ ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravathi) ప్రకటించింది. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS)ను క్యాంప్ కార్యాలయంలో కలిసి ఉద్యమ కార్యాచరణ లేఖను అందించారు.
విజయవాడ: మలిదశ ఉద్యమ కార్యాచరణను ఏపీ జేఏసీ అమరావతి (AP JAC Amaravathi) ప్రకటించింది. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి నేతలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) క్యాంప్ కార్యాలయంలో కలిసి ఉద్యమ కార్యాచరణ లేఖను అందించారు. అనంతరం ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) మీడియాతో మాట్లాడుతూ కార్యవర్గంలో చర్చించిన అంశాలను సీఎస్‌ను కలిసి అందించామన్నారు. ఉద్యమ కార్యచరణ అమలు అవుతుందని నోటీసు ఇచ్చామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ ఉనికి కోసం చేస్తున్న ఉద్యమం కాదని, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమం అని స్పష్టం చేశారు. తమ డబ్బులు హక్కు ప్రకారం ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
1వ తేదీన జీతాలు (Salaries) ఇవ్వల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, సకాలంలో జీతాలు ఇవ్వకపోతే ఉద్యోగుల కుటుంబాలు (Employees Families) ఆందోళన చెందుతున్నాయని బొప్పరాజు అన్నారు. ఈఎంఐ (EMI)లు చెల్లించలేదని బ్యాంకులు వడ్డీలు వసూలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు రాక లోన్ యప్స్‌లో లోన్ తీసుకుని ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. డీఏ (DA) లెక్కలు ప్రభుత్వం ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. జీతం పెరిగితే సంతోషించే స్థితి నుంచి జీతాలు పడితే చాలు ఆన్న స్థితికి తెచ్చారని, ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ఆన్యాయం చేస్తున్నారని నిలదీశారు.
4 ఏళ్లుగా పే స్కేల్స్ (Pay Scales) ఎందుకు అమలు చేయడం లేదు?.. వైద్య, పోలీస్ విభాగాలకు ఇచ్చే స్పెషల్ పేలపై సైతం నోరు మెదపడం లేదని బొప్పరాజు అన్నారు. 62 ఏళ్లకు సర్వీస్ అన్నారు కానీ.. అన్ని శాఖల్లో ఉన్నవారికి మాత్రం వర్తింప చేయడం లేదన్నారు. సచివాలయాలు ఎందుకు పెట్టారో చెప్పరని.. వసతులు లేకుండా పనులు చేయాలని ఒత్తిడి పెడుతున్నారన్నారు. ఉద్యోగులను ఎందుకు చులకనగా చూస్తున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. అనంతపురంకు చెందిన డీఆర్డీయే (DRDA) ఉద్యోగి జీతం రాక లోన్ యాప్‌లో అప్పు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారన్నారు. మిగిలిన సంఘాలను ఉద్యమంలోకి రావాలని కోరామని బొప్పరాజు అన్నారు.
Updated Date - 2023-04-07T12:26:41+05:30 IST