Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు
ABN, First Publish Date - 2023-09-10T13:06:15+05:30
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును శనివారం అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కాంక్షలు విధించారు.
అమరావతి: టీడీపీ అధినేత (TDP Chief), మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Ex CM Chandrababu)ను శనివారం అరెస్టు చేసిన పోలీసులు ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో విజయవాడ ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ కాంక్షలు (Traffic Desires) విధించారు. సిట్ కార్యాలయం (SIT Office) నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వరకు ఎటువంటి వాహనాలను అనుమతించలేదు. కాగా చంద్రబాబు అరెస్టుకు నిరసగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు చేపట్టారు.
చిత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నిరసనలు, దీక్షలు చేపట్టింది. ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కాజారు బాలాజీని అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ దొరబాబు ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. పూతలపట్టు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి మురళీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగుతున్నాయి. కుప్పంలో టీడీపీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా: చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ టీడీపీ నేత జాలెం సుబ్బారావు మామిడికుదురు మండలం, నగరం గ్రామంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. కొత్తపేట నియోజకవర్గం, పి.గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ శ్రేణులు నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే మండపేటలో టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ వీవీవీ చౌదరిలు నిరసన దీక్ష చేపట్టారు.
తూర్పుగోదావరి జిల్లా: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనపర్తి మండలం, రామవరంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, టీడీపీ శ్రేణులు నల్ల దుస్తులు ధరించి నిరాహారదీక్ష చేపట్టారు.
కాకినాడ: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాకినాడ, పిఠాపురం నియోజకవర్గాల్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు కొండబాబు, వర్మ నల్ల దుస్తులు ధరించి నిరాహార దీక్షలు చేపట్టారు.
నంద్యాల: బనగానపల్లె పట్టణంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. అలాగే నందికొట్కూరు పటేల్ సెంటర్లో టీడీపీ నేతలు నిరసన దీక్షలు చేపట్టారు.
ప.గో.జిల్లా: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సామూహిక నిరసన దీక్ష చేస్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరిమిల్లి రాధాకృష్ణను వెంటనే విడుదల చేయాలని పీఎస్ ముందు టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు.
కర్నూలు: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎమ్మిగనూరు సోమప్ప సెంటర్‌లో కళ్ళకు గంతలు కట్టుకొని టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మంత్రాలయంలో రాఘవేంద్ర సర్కిల్‌లో టీడీపీ ఇంచార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే ఆలూరు అంబేద్కర్ సర్కిల్లో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.
ఏలూరు జిల్లా: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఏలూరు బడేటి క్యాంప్ కార్యాలయంలో బడేటి చంటి తన కార్యకర్తలతో సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఆయన ఖండించారు. చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా: చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అరకులోయలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ తన కార్యకర్తలతో నిరాహార దీక్షలు చేపట్టారు.
అనంతపురం: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కళ్యాణదుర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. అలాగే రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. మరోవైపు చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని కోరుతూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని దశ బుజా గణపతి దేవాలయంలో మాజీ జడ్పీ చైర్మన్ నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
విశాఖ: చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు నిరాహార దీక్షలు చేపట్టారు. టీడీపీ కార్యాలయంలో విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ‘సైకో పోవాలి...సైకిల్ రావాలని’ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు.
శ్రీ సత్యసాయి జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మంజునాథ్ అనే కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. లేపాక్షి మండలం మైదు గోళంలో ఈ ఘటన చోటు చేసుకుంది. లేపాక్షి పోలీసుల విజ్ఞప్తి మేరకు కిందికి దిగిన మంజునాథ్ అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా పుట్టపర్తి ఆర్డీవో కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు. దీంతో పోలీసులు నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేశారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డగించారు. ఇక చేసేదేమిలేక నిరసనకారులను వదిలేసారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట శాంతియుత నిరసనలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
Updated Date - 2023-09-10T13:06:15+05:30 IST