Ramakrishna: జగన్ మంకుపట్టు వీడాలన్న సీపీఐ నేత
ABN, First Publish Date - 2023-03-30T14:50:14+05:30
అమరావతి రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంకుపట్టు వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు.
అమరావతి: అమరావతి రాజధాని అంశం (Amaravati Capital Issue)పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) మంకుపట్టు వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని ఉద్యమం 1200 రోజులకు చేరుకుని, చరిత్రలో కనివినీ ఎరుగని ఉద్యమమైందని తెలిపారు. అమరావతినే రాజధానిగా అభివృద్ధి పరచాలని హైకోర్టు చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయకుండా సుప్రీంకోర్టుకెక్కిందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు (Supreme Court) లో కూడా జగన్ సర్కారుకు అనుకూలంగా స్టే ఇవ్వలేదన్నారు. తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్న ఏకైక నేతగా జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ప్రజల్ని మభ్యపెట్టారని విమర్శించారు. అధికారంలోకి రాగానే మాట మార్చి, మడం తిప్పి, మూడు రాజధానుల పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారు. ఉగాది తదుపరి విశాఖ నుంచి పాలన సాగిస్తామన్న జగన్‌కు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖలో చుక్కెదురయిందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞత ప్రదర్శించి అమరావతినే రాజధానిగా కొనసాగిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
Updated Date - 2023-03-30T14:50:14+05:30 IST