Ramakrishna: ‘మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారమివ్వకండి’
ABN, First Publish Date - 2023-03-31T10:14:11+05:30
రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారం ఇవ్వొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమానికి ఆస్కారం ఇవ్వొద్దని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (CPI Leader Ramakrishna) వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy)కి రామకృష్ణ లేఖ రాశారు. ప్రజారంజక పాలనంటే పదేపదే విద్యుత్ భారాలు ప్రజలపై మోపటమేనా అని ప్రశ్నించారు. 2014 - 19 విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ చార్జీల పేరుతో రూ.2900 కోట్లు వినియోగదారులపై భారం మోపారన్నారు. మరో రూ.3083 కోట్లు గుదిబండ వేసేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు. 2020 - 21 విద్యుత్ వినియోగంపై ట్రూ అప్ చార్జీల పేరుతో యూనిట్‌కు 65 పైసల వరకు వసూలు చేసే ఆదేశాలు ఇవ్వటం తగునా అని నిలదీశారు. గత ఎన్నికల సందర్భంగా విద్యుత్ చార్జీలు పెంచబోమని ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. ఇది మాట తప్పటం, మడమ తిప్పటం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ బొగ్గు కొనుగోలుకు అధిక ధర ఇస్తూ, ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపటాన్ని ఖండిస్తున్నామన్నారు. విద్యుత్ సర్దుబాటు చార్జీల భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రామకృష్ణ లేఖలో డిమాండ్ చేశారు.
Updated Date - 2023-03-31T10:14:11+05:30 IST