Ramakrishna: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం మృతులకు రూ.10 లక్షలు ఇవ్వాలి
ABN, First Publish Date - 2023-10-27T09:54:21+05:30
విజయవాడ: కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వలస కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..
విజయవాడ: కర్ణాటకలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వలస కూలీల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన వలస కూలీలు 10 మంది ప్రమాదంలో మరణించారని, ఏపీలో ఉపాధి కరువవటం వల్లే పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ సర్కార్ కరువు సహాయక చర్యలు, వలసల నివారణపై ఏమాత్రం దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని రామకృష్ణ అన్నారు.
కాగా కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్‌లో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 12 మంది ఏపీ వాసులు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని టాటా సుమో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 12 మంది మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. బాగేపల్లి, చిక్కబళ్లాపూర్ మార్గంలో 44వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల మండలంలోని సమీప గ్రామాలకు చెందిన వారుగా గుర్తించారు. దసరా పండుగ కోసం ఊరికి వచ్చి తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతిచెందిన వారంతా బెంగళూరులో కూలి పనులకు వెళ్లే కూలీలుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే కర్ణాటక పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అలాగే గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
రహదారిపై పొగమంచే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దట్టమైన పొగమంచు కారణంగా ఆగి ఉన్న లారీని డ్రైవర్ గుర్తించకపోవడంతో ఇంతటి ఘోరం జరిగింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా... ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఓడిస్సాకు చెందిన భార్యాభర్తలు వెంకటనారాయణ, సుబ్బమ్మ ఉన్నారు.
Updated Date - 2023-10-27T09:54:21+05:30 IST