AP Assembly: సభలో అందుబాటులో లేని పలువురు మంత్రులు.. అసెంబ్లీ అంటే లెక్కలేదా అంటూ టీడీపీ ఆగ్రహం
ABN, First Publish Date - 2023-03-15T12:18:55+05:30
ఏపీ శాసనసభలో పలువురు మంత్రులు అందుబాటులో లేకుండా పోయారు.
అమరావతి: ఏపీ శాసనసభ (AP Assembly Budget Session)లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఏపీ శాసనసభలో పలువురు మంత్రులు అందుబాటులో లేకుండా పోయారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ (TDP) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందిగా మంత్రులు చెల్లుబోయిన, పెద్దిరెడ్డిలను స్పీకర్ తమ్మినేని సీతారాం (Speaker Tammineni Sitharam) పిలిచారు. అయితే మంత్రులు అందుబాటులో లేకపోవడంతో స్పీకర్ తర్వాత ప్రశ్నలకు వెళ్లారు. ప్రశ్నోత్తరాల్లో మంత్రులు అందుబాటులో లేకపోవడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ అంటే మంత్రులకు లెక్కలేదా అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుంటే ఎలా అంటూ టీడీపీ సభ్యులు విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రులతో ఈ సెన్సులో సమాధానం చెప్పిస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పడంతో తెలుగుదేశం సభ్యులు వెనక్కి తగ్గారు.
అనంతరం ప్రశ్నోత్తారాలు కొనసాగాయి. విద్యాశాఖ అధికారులకు మంత్రికి మధ్య సమన్వయ లోపం ఉన్నట్టు ఉందని టీడీపీ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామి (TDP MLA Dola Bala Veeranjaneya Swamy) అన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవంబర్ 10 సమీక్షలో మూడు లక్షల 95 వేల మంది తగ్గారని చెప్పారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్టీ, ఎస్సీ కాలనీలలో పాఠశాలలు పెడితే దాన్ని ఈ ప్రభుత్వం తీసేశారని మండిపడ్డారు. మంత్రి అప్పలరాజు నియోజకవర్గంలోనే అనేక పాఠశాలలను మూసేశారన్నారు. ప్రపంచ బ్యాంకు నిభందనలకు సంబంధించి పాఠశాలలను మెర్జి చేస్తున్నారని తెలిపారు.
దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) సమాధానం ఇస్తూ... ప్రైవేటు పాఠశాలల్లో సంఖ్య పెరిగింది అన్నారు. అయితే ఏపీలో 102 శాతం అడ్మిషన్లు జరుగుతున్నాయన్నారు. ఈరోజు 70 లక్షల 18 వేలమంది చదువుతున్నారని తెలిపారు. గవర్నమెంట్‌లో 39 లక్షల 69 వేల మంది చదువుతున్నారన్నారు. అంటే గవర్నమెంట్‌లో పెరిగారా, ప్రైవేట్‌లో పెరిగారో తమరు చూసుకోండన్నారు. గత ప్రభుత్వ హయంలో 5వేల స్కూళ్ళు మూసివేశారని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక 3 వేల స్కూళ్లను తెరిపించామని చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క స్కూలు మూసి వెయ్యలేదని తెలియజేశారు. గతంలో 1 నుంచి 5 వరకూ ఒకే టీచర్ టీచ్ చేసేవారని... ఇప్పుడు మూడవ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట తీసుకువచ్చామన్నారు. కిలో మీటరు పరిధిలో ఉన్న స్కూళ్లు విలీనం చేయాలని నిర్ణయిచామని అన్నారు. అయితే ఏ ఒక్క స్కూలును ఇప్పటి వరకూ మూయలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Updated Date - 2023-03-15T12:18:55+05:30 IST