తీరు మారని పేర్ని నాని!
ABN , First Publish Date - 2023-11-15T00:50:59+05:30 IST
కృష్ణా జిల్లా పరిషత్ సమావేశంలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి ఏలూరు జిల్లా కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. జెడ్పీ సమావేశం మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్‌హాలులో మంగళవారం జరిగింది.

మచిలీపట్నం, నవంబరు14 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా జిల్లా పరిషత్ సమావేశంలో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మరోసారి ఏలూరు జిల్లా కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. జెడ్పీ సమావేశం మచిలీపట్నం జెడ్పీ కన్వెన్షన్‌హాలులో మంగళవారం జరిగింది. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగంపై సమీక్ష జరుగుతున్న సమయంలో ఎస్‌ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన ఎక్కడకు వెళ్లారనే అంశంపై ఎమ్మెల్యే పేర్ని నాని ఆరా తీశారు. ఏలూరు జిల్లా సాగునీటి సలహ మండలి సమావేశానికి అనుమతి తీసుకునే వెళ్లారని కృష్ణా కలెక్టర్ పి.రాజాబాబు, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాలహారిక తెలిపారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, వ్యవస్థలంటే లెక్కలేని తనంతో ఏలూరు జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం ముఖ్యమా, ఏలూరు జిల్లా ఐఏబీ సమావేశం ముఖ్యమా.. అని ప్రశ్నించారు. జెడ్పీ సర్వసభ్య సమావేశం ఉన్నట్టు ఏలూరు జిల్లా కలెక్టర్‌కు జెడ్పీ సీఈవో సమాచారం ఇచ్చారా.. అని జెడ్పీ చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. ముందస్తు సమాచారం ఇచ్చామని, జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక తెలిపారు. సమాచారం ఇస్తే అదే రోజు ఏలూరు జిల్లా కలెక్టర్ ఐఏబీ సమావేశం ఎలా నిర్వహిస్తారని, ఐఏబీ సమావేశం మార్పు చేయవచ్చుకదా అని ఆయన అన్నారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా పరిషత్ సమావేశానికి నేను రాను, మా వాళ్లు ఎవరూ రారు అని చెప్పినట్టుగా ఉందన్నారు. ఏలూరు జేసీని పంపి సరిపేట్టేద్దామనే ధోరణితో వ్యవహరిస్తున్నారని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశం జరుగుతుంటే కృష్ణా జిల్లా అధికారులను ఏలూరు జిల్లాకు తీసుకువెళితే ఇక్కడి సమస్యలపై ఎవరు సమాధానం చెబుతారు, ఇక్కడి జెడ్పీటీసీ సభ్యులు ప్రజలు ఓట్లేసి గెలిపించిన వారు కాదా అని ప్రశ్నించారు. కృష్ణాజిల్లా అధికారులను ఐఏబీ సమావేశం పేరుతో ఏలూరు జిల్లాకు తీసుకువెళ్లి ఎలాంటి మెసేజ్ ఇద్దామని ఆ కలెక్టర్ అనుకుంటున్నారని అన్నారు. కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ పదవికి ఇచ్చే గౌరవం ఇది కాదని అన్నారు. ఏలూరుజిల్లా కలెక్టర్‌తో తనకు వ్యక్తిగత గొడవలు లేవని, వ్యవస్థలను గౌరవించాలని మాత్రమే చెబుతున్నానన్నారు. గత జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ రాలేదని ఈ విషయంపై తాను ప్రశ్నించి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశానన్నారు. దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కలుగజేసుకుని తనకు కొల్లేరులో చేపల చెరువులున్నాయని, వాటిని కలెక్టర్ అడ్డుకోవడంతోనే ఏలూరు జిల్లా కలెక్టర్‌పై తాను ఆరోపణలు చేస్తున్నానని విమర్శలు చేశారన్నారు. ముందస్తుగా తీసుకున్న అనుమతులతోనే నీటిపారుదలశాఖ ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ ఏలూరు జిల్లా ఐఏబీ సమావేశానికి వెళ్లారని కృష్ణా కలెక్టర్ రాజాబాబు కాగితాలు చూపినా పేర్ని నాని తనదైన శైలిలో ఏలూరు జిల్లా కలెక్టర్‌పై విమర్శలకు దిగడం చర్చనీయాంశమైంది.
సమస్యలపై అడగనివ్వరు..
అధికారులను మాట్లాడనివ్వరు!
ఆయా మండలాల పాఠశాలల్లో సమస్యలు, ధాన్యం కొనుగోలులో గతేడాది రైతుల ఇబ్బందులు, తాగునీటి సమస్యలపై ప్రజల ఇక్కట్లు.. జెడ్పీటీసీసభ్యులు, ఎంపీపీలు అధికారులను ప్రశ్నిస్తుంటే పేర్ని నాని తనదైన శైలిలో మాట్లాడనివ్వకుండా అడ్డుకున్నారు. పరిష్కారంకాని సమస్యలను ఇక్కడ అడగవద్దన్నారు. జిల్లాపరిషత్ సమావేశంలో అధికారులను అడిగితే పాఠశాలల అదనపు తరగతిగదులకు అనుమతులు రావన్నారు. నేరుగా ఎమ్మెల్యేలతో కలిసి మంత్రులు, ఆయాశాఖల కమిషనర్లవద్దకు వెళితేనే పనులు జరగుతాయని ఉద్భోదించారు. కృత్తివెన్నుమండల జెడ్పీటీసీ సభ్యురాలు మైలా రత్నకుమారి శీతనపల్లిలోని పాఠశాలలో అదనపు తరగతిగదులు నిర్మాణానికి అనుమతులు వచ్చినా నిర్మాణం చేయడం లేదని అన్నారు. నూతన గృహాలకు అనుమతులు ఇవ్వడం లేదని, ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఈ అంశాలపై పేర్నినాని మంత్రి జోగి రమే్‌షను వెంటబెట్టుకుని వెళితే పాఠశాలల్లో అదనపు తరగతి గదులకు అనుమతులతోపాటు నిధులు మంజూరువుతాయన్నారు. గృహ నిర్మాణ శాఖమంత్రిని మీ నియోజకవర్గంలోనే పెట్టుకుని మళ్లీ నూతన గృహాల నిర్మాణానికి అనుమతులు ఎప్పుడిస్తారని అడగడమేంటని ప్రశ్నించారు. మండలంలో నెలకొన్న ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్నామని, ప్రశ్నించకుంటే ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారని ఆమె ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు అంశంపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమే్‌షబాబు ప్రశ్నిస్తుండగా ఆయనను పేర్ని నాని వారించారు. అసెంబ్లీలోనూ మాట్లాడి, జిల్లా పరిషత్ సమావేశంలోనూ మీరే మాట్లాడతారా, ఇతరులకు అవకాశం ఇవ్వరా.. అంటూ నిలువరించారు. దీంతో సభ్యులు కొంత ఇబ్బందికి గురయ్యారు. విషయం గ్రహించిన పేర్ని మాట్లాడుతూ, మనం అధికారపార్టీకి చెందిన వారమని, సమస్యలపై ప్రశ్నించి ఆంధ్రజ్యోతి, ఈనాడు విలేకరులకు రాసే అవకాశం ఇవ్వొద్దని అన్నారు. మిమ్మల్ని గాడిలో పెట్టేందుకే చెబుతున్నానని, మీ మండలంలో సమస్యలుంటే ఎమ్మెల్యేను వెంటబెట్టుకుని సెక్రటేరియట్‌కు వెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. గన్నవరానికి చెందిన జెడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు గౌస్ పాఠశాలల అంశంపై మాట్లాడుతుండగా పేర్ని కూర్చోమని చెప్పారు. పమిడిముక్కల మండలం తాడేపల్లి పాఠశాల స్థలాన్ని అక్రమించి బెల్ట్‌షాప్ ఏర్పాటు చేశారని, అక్కడే డ్రగ్స్‌కూడా విక్రయిస్తున్నారని పమిడిముక్కల జె డ్పీటీసీ సభ్యురాలు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఆమె మాట్లాడుతున్న సమయంలో మైక్ తీసుకున్న పేర్నినాని కొద్దిసేపటి తరువాత ఆమెకు మళ్లీ మైక్ ఇచ్చారు. సభ్యులు ప్రశ్నలు అడిగిన ప్రతిసారి అడ్డుకోవడంతోపాటు, అధికారులు సరైన సమాధానం చెప్పకుండా చేయడంలో పేర్నినాని వ్యవహరించిన తీరుపై జెడ్పీటీసీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.