Pattabhiram: కొత్తనాటకానికి తెరలేపిన జగన్ రెడ్డి..
ABN, First Publish Date - 2023-05-18T16:01:21+05:30
రాజధానిలో ఇళ్ల స్థలాలపేరుతో పేదల్ని దగా చేస్తూ సీఎం జగన్ రెడ్డి (CM Jagan) కొత్తనాటకానికి తెరలేపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శించారు.
అమరావతి: రాజధానిలో ఇళ్ల స్థలాలపేరుతో పేదల్ని దగా చేస్తూ సీఎం జగన్ రెడ్డి (CM Jagan) కొత్తనాటకానికి తెరలేపారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇళ్ల స్థలాల పేరుతో చిత్తు కాగితంతో సమానమైన పట్టాలను జగన్ రెడ్డి పేదలకు ఇస్తున్నారని సుప్రీంకోర్టు (Supreme Court) వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. ప్రభుత్వమిచ్చే ఇళ్లపట్టాలు అమ్మకానికి, రుణం పొందడానికి పనికిరావని దేశ అత్యున్నత న్యాయస్థానం చెప్పలేదా? అని ప్రశ్నించారు. నిజమైన పేదలపక్షపాతి చంద్రబాబేనని, కాబట్టే సీఆర్డీఏ (CRDA) చట్టంలోనే రాజధాని ప్రాంతంలో 5 శాతం భూమిని పేదల ఇళ్లకు కేటాయించారన్నారు. దేశంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా చంద్రబాబు (Chandrababu) ఒక్కరే ప్రజా రాజధాని అమరావతిలో 5 శాతం భూమిని పేదలకు కేటాయిస్తూ 2014 డిసెంబర్లోనే చట్టం చేశారని చెప్పారు.
రాజధానిలో ఎలాంటి లిటిగేషన్లులేని చట్టబద్ధమైన భూమిని చంద్రబాబు పేదలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి కోర్టు వివాదాల్లో ఉన్న భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇవ్వడం పేదల్ని వంచించడం కాదా? అని పట్టాభిరామ్ ప్రశ్నించారు. పేదలపై జగన్ రెడ్డికి అమితమైన ప్రేమాభిమానాలుంటే చంద్రబాబు అమరావతిలో పేదల కోసం నిర్మించిన 5 వేల ఇళ్లను 4 ఏళ్లుగా పేదలకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. సీఎంకు పేదలపై వల్లమాలిన ప్రేమాభిమానాలే ఉంటే తాడేపల్లి నివాసం పక్కనున్న వెయ్యి పేదల ఇళ్లను రాత్రికి రాత్రి ఎందుకు నేలమట్టం చేశారన్నారు.
జగన్ పేదలకు న్యాయం చేసేవారయితే పీఎంఏవై (PMAY) గ్రామీణ్ పథకం కింద 2019 నుంచి 2023 మధ్య వారి కోసం కేవలం 823 ఇళ్లు మాత్రమే ఎందుకు కట్టారని పట్టాభిరామ్ ప్రశ్నంచారు. కేంద్రమంత్రి పార్లమెంట్లో చెప్పిన లెక్కల ప్రకారం అతి చిన్న రాష్ట్రమైన అస్సాం కూడా పేదల కోసం 2.15 లక్షల ఇళ్లు కడితే, పేదల ఉద్ధారకుడినని చెప్పుకునే జగన్ 800 ఇళ్లే కట్టడమేంటని నిలదీశారు. ఇళ్లపట్టాల ముసుగులో జగన్ కుట్రల్ని నమ్మిమోసపోవద్దని పేదలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాజధాని సహా, రాష్ట్రంలోని పేదలందరికీ అన్నివసతులతోకూడిన అధునాతన ఇళ్ల నిర్మాణాలను గతంలోవలే కొనసాగిస్తారని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.
Updated Date - 2023-05-18T16:01:21+05:30 IST