Skill Development Case: చంద్రబాబు కేసులో నేడు కీలక పరిణామాలు
ABN, First Publish Date - 2023-09-25T07:13:19+05:30
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరోవైపు ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటీషన్ విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కేసులో సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. మరోవైపు ఇవాళ చంద్రబాబు బెయిల్ పిటీషన్ (Bail Petition) విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల సీఐడీ కస్టడీ (CID Custody) ముగియడంతో మళ్లీ కస్టడీకి కావాలని సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు. కస్టడీ పొడిగింపు పిటీషన్‌పై తమ వాదనలు కూడా వినాలని చంద్రబాబు తరపు న్యాయవాది పోసాని నిన్ననే కోరారు. ఈ రోజు మెమోపై కోర్టు విచారించే అవకాశం ఉంది. అలాగే చంద్రబాబుపై ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులలో పిటీ వారెంట్‌లపై కూడా విచారించాలని సీఐడీ కోరింది. కాగా సుప్రీం కోర్టు (Supreme Court)లో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటీషన్‌పై ఏమి జరుగుతుందోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని చంద్రబాబు సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు. రెండ్రోజుల కస్టడీలో చివరి రోజైన ఆదివారం కూడా సీఐడీ(CID) బృందం ఆయన్ను రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ప్రశ్నించింది. ఆధారాల్లేకుండా అడిగే వాటికి ఏం సమాధానం చెబుతామని ఆయనీ సందర్భంగా ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారుల సమగ్ర పరిశీలన తర్వాత, అందరి ఆమోదంతో ఒప్పందం కుదిరిందన్నారు. భాగస్వామి విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏమీ లేదని.. అధికారులంతా సవ్యంగానే ఉందని నిర్ధారించారని తేల్చిచెప్పారు. పలు రాష్ట్రాల్లో సీమెన్స్ కంపెనీ(Siemens Company) ఇదే తరహా ఒప్పందాలు చేసుకుందని.. కేంద్రం కూడా ఆ సంస్థతో కలిసి పనిచేసిందని గుర్తుచేశారు. సీఐడీ అడిగిన ప్రతి ప్రశ్నకు సూటిగా, స్పష్టంగా సమాధానమిచ్చారు. ‘ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు మీ ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు వచ్చాయని అంటున్నారు.. మీరేమంటారు’ అని ప్రశ్నించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ‘మీ చేతుల్లో అధికారం ఉంది. మీది దర్యాప్తు సంస్థ. ఆరోపణలు వచ్చినప్పుడు ఆధారాలు సేకరించి అడగాలి. ఎవరో అన్నారంటూ గాలి ఆరోపణలు చేయొద్దు.. 45 ఏళ్ల రాజకీయ జీవితం నాది. ఎంతో నిబద్ధతతో రాజకీయాలు చేశాను. దానిని చంపేయకండి. 2021లోనే కేసు నమోదు చేశారు. నన్ను అరెస్టు చేసి 16 రోజులవుతోంది. ఈ మధ్యకాలంలో నా ఖాతాల వివరాలన్నీ మీరు తెప్పించుకుని ఉండొచ్చు కదా! ఏమైనా చూశారా? మీకు ఎక్కడైనా కనిపించిందా? ఏ రికార్డూ చూడకుండా అనుమానం ఉందని అంటే ఎలా? దురుద్దేశపూర్వకంగా అడిగేవాటికి ఏమని సమాధానం చెప్పాలి’ అని చంద్రబాబు నిలదీశారు.
Updated Date - 2023-09-25T07:13:19+05:30 IST