Atchannaidu: ‘నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం సంతోషం’
ABN, First Publish Date - 2023-03-13T10:46:34+05:30
ఆస్కార్ అవార్డు పొందిన ఆర్.ఆర్.ఆర్. బృందానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
అమరావతి: ఆస్కార్ అవార్డు (Oscar Award) పొందిన ఆర్.ఆర్.ఆర్. బృందాని (RRR Movie Team)కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్.ఆర్.ఆర్తో తెలుగు సినిమా సత్తా మరో స్థాయికి తీసుకెళ్లారని హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డు పొందిన ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందానికి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశారు. నాటు నాటు పాట (Natu Natu Song) తో తెలుగు సినిమా సత్తాను భారతీయ సంగీత ఘనతను ప్రపంచానికి తెలియజేశారని అన్నారు. ఇప్పటికే ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించిన నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజలందరూ ప్రపంచ యువనికపై కాలర్ ఎగరేసుకుని తిరిగేలా మరోసారి చేసిన సినిమా బృందానికి ధన్యవాదాలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలు సాధించాలని, తెలుగు సినిమా సత్తాను మరింతగా చాటాలని ఆశిస్తున్నట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
కాగా.. లాస్ ఏంజిల్స్ (Los Angeles) లో డాల్బీ థియేటర్ వేదికగా 95వ ఆస్కార్ వేడుకగా ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది ప్రేక్షకులను అలరించిన తెలుగు పాట ‘నాటు నాటు...’ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగం (Best Original Song category) లో ఉత్తమ పాటగా అకాడమీ అవార్డును సొంతం చేసుకుని అంతర్జాతీయ వేదికపై తెలుగువాడి సత్తాచాటింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగీరిలో పోటీ పడిన ‘అప్ల్లాజ్’ (టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్), ‘లిఫ్ట్ మి అప్’ (బ్లాక్ పాంథర్: వకాండా ఫెరవర్), దిస్ ఈజ్ ఎ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’, ‘హోల్డ్ మై హ్యాండ్’ (టాప్‌గన్ మావెరిక్) పాటలను పక్కకు నెట్టి ‘నాటు నాటు’ ఆస్కార్ దక్కించుకుంది. అకాడమీ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రం (Indian Movie)గా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చరిత్ర సృష్టించింది.
Updated Date - 2023-03-13T10:46:34+05:30 IST