Srisailamలో ఉగాది మహోత్సవాలు... మహాసరస్వతి అలంకారంలో అమ్మవారు
ABN, First Publish Date - 2023-03-21T10:25:12+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
నంద్యాల: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి ఆలయం (Srisailam Sribharamamba Mallikarjuna Swamy Temple) లో ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాది మహోత్సవాల్లో భాగంగా మూడవరోజు మహాసరస్వతి అలంకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. నందివాహనంపై ఆసీనులై ఆదిదంపతులు ప్రత్యేక పూజలందుకోనున్నారు. శ్రీస్వామి అమ్మవార్లకు క్షేత్ర పురవీధుల్లో ప్రభోత్సవం జరుగనుంది. సాయంత్రం క్షేత్ర పురవీధుల్లో శ్రీస్వామి అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శివదీక్ష శిబిరాలలో వీరశైవులచే వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం చేయనున్నారు. భక్తుల రద్ది కారణంగా స్వామివారి స్పర్శ దర్శనాలు రద్దు చేస్తున్నామని... భక్తులందరికీ అలంకార దర్శనం కల్పిస్తున్నామని ఈఓ లవన్న పేర్కొన్నారు.
శాస్త్రోక్తంగా ఆరంభం...
శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు మార్చి 19న శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. ముందుగా ఈవో ఎస్ లవన్న దంపతులు శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చక వేదపండితులతో కలిసి స్వామివారి యాగశాల ప్రవేశం చేయడంతో ఐదు రోజులపాటు జరిగే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గణపతిపూజ అఖండ దీపరాదన, కళశస్థాపన, వేదస్వస్థి, రుత్విగ్వరణం, పుణ్యహ్వచనం, చండీశ్వర పూజ, రుద్రపారాయణం, రుద్ర కళశస్థాపన, కంకణపూజ, కంకణధారణ చేశారు. అనంతరం శ్రీ భ్రమరాంబ అమ్మవారికి విశేష కుంకుమార్చన, నవావరణార్చన, చండీహోమాలను నిర్వహించారు.
రెండో రోజు మహాదుర్గ అలంకారంలో అమ్మవారు...
ఈ ఉత్సవాల్లో రెండో రోజు మహాదుర్గ అలంకారంలో శ్రీభ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చారు. మహాదుర్గ అలంకారరూపంలో ఆశీనులైన అమ్మవారు, శ్రీ స్వామి వారికి వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు భక్తుల రద్ధీని దృష్టిలో ఉంచుకొని స్వామివారి అలంకరణ దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈవో లవన్న తెలిపారు. స్వామివారి గర్బాలయ, ఆర్జిత అభిషేకాలు, సామూహిక అభిషేకాలు పది రోజులపాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆలయ ఈవో వెల్లడించారు.
Updated Date - 2023-03-21T10:26:21+05:30 IST