Nandyala: శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ABN, First Publish Date - 2023-02-12T10:30:21+05:30
నంద్యాల: శ్రీశైలం (Srisailam) మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivaratri Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి.
నంద్యాల: శ్రీశైలం (Srisailam) మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు (Mahashivaratri Brahmotsavams) వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవరోజు ఆదివారం శ్రీ భమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భృంగివాహన సేవ (Bhringivahana Seva), విశేషపూజలు నిర్వహించారు. దీంతో ఆలయానికి భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. శివస్వాములతో ప్రత్యేక క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. లోక కల్యాణం కోసం రుద్రహోమం, చండీహోమం, జపాలు, పారాయణలు జరగనున్నాయి. సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు శ్రీశైలం పురవీధులలో గ్రామోత్సవం నిర్వహించనున్నారు.
కాగా శ్రీశైలం మహక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. నవాహ్నిక దీక్షతో 11 రోజులపాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 21తో ముగియనున్నాయి. శనివారం ఉదయం 8:45 గంటలకు ఆలయ ప్రాంగణంలోని స్వామివారి యాగశాల ప్రవేశం కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అనంతరం వేదపండితులు చతుర్వేదపారాయణాలు చేసి వేదస్వస్తి నిర్వహించారు. వేదస్వస్తి తరువాత దేశం శాంతిసౌభాగ్యాలతో విరిసిల్లాలని ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కళ్యాణ సంకల్పాన్ని పఠించారు. దీనినే శివసంకల్పం అంటారు. అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజను చేశారు. ఈ బ్రహ్మోత్సవాల సృష్ఠికర్త అయిన బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో, శివ పరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో జరుగుతున్నందున చండీశ్వరునికి ప్రతేకంగా పూజాదికాలు జరిపారు. కంకణాలకుశాస్ర్తోక్తంగా పూజాదికాలు నిర్వహించి వాటిని ఽఅర్చకులు, అధికారులు ధరించారు. అనంతరం రుత్విగ్వరణం నిర్వహించి, అఖండదీపస్థాపన, వాస్తుపూజ, వాస్తు హోమం జరిపించారు.
బ్రహ్మోత్సవాల మొదటి రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకముందు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతావిష్కరణ చేసి ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్త వస్త్రం మీద పరమశివుని వాహనమైన నందీశ్వరుడిని చిత్రీకరిస్తారు. దీనికే ధ్వజపటం అని పేరు. తరువాత ధ్వజపటానికి చండీశ్వరుని సమక్షంలో ప్రత్యేక పూజాదికాలు, భేరీపూజ నిర్వహిస్తారు. ఈ భేరీపూజలో డోలు వాద్యానికి పూజాదికాలు చేసి, తరువాత నాదస్వరంపై ఆయా రాగాల ఆలాపనతో ఆయా దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. చివరగా ధ్వజస్థంభంపై ఎగరవేస్తారు. ధ్వజస్థంభం మీద ఎగిరే ఈ నందిపతాకమే సకల దేవతలకు, యక్ష, గంధర్వ గణాలకు ఆహ్వానమని, బ్రహ్మోత్సవాల సమయంలో దేవతలంతా క్షేత్రంలోనే ఉంటూ ఉత్సవాన్ని తిలకిస్తారని ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి.
Updated Date - 2023-02-13T12:06:13+05:30 IST