Nara Lokesh: పాలిచ్చే ఆవు వద్దని.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు..
ABN, First Publish Date - 2023-04-17T12:46:13+05:30
కర్నూల్ జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సోమవారం ఉదయం కర్నూలు జిల్లా, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతోంది.
కర్నూల్ జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సోమవారం ఉదయం కర్నూలు జిల్లా, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ ఎన్కే కొట్టాల క్యాంప్ సైట్ నుంచి యాత్ర ప్రారంభమైంది. గుండ్లకొండ, గుడిమిర్ల, బుర్రుకుంటలో లోకేష్ స్థానికులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా లోకేష్ మాట్లాడుతూ వైకాపా పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రక్షాళన చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రి అవుతారని, అందరి సమస్యలు పరిష్కారం అవుతాయని ఇందులో సందేహం లేదని ఆయన స్పష్టం చేశారు.
మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసే అనుభవం ఉన్న చంద్రబాబును వద్దనుకుని.. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అందరినీ ముద్దులు పెట్టుకుని తిరిగిన జగన్‌ను నమ్మి గెలిపించారని.. ‘పాలిచ్చే ఆవు వద్దని తన్నే దున్నపోతును తెచ్చుకున్నారు’ అంటూ ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ కట్, గిట్టబాటు ధర లేదు, రైతు రథాలు లేవు, డ్రిప్ ఇరిగేషన్.. రైతులకు ఉచితంగా ఇస్తున్న కరెంట్ కూడా కట్ చేశారని విమర్శించారు.
చంద్రబాబు ఒక ప్రణాళికతో 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీ లోటు బడ్జెట్‌లో ఉన్నా.. ఓ పద్ధతి ప్రకారం వ్యవసాయ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళారని అన్నారు. గిట్టుబాటు ధర కల్పించారన్నారు. ఇప్పుడు ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి కోర్టు దొంగ అని అన్నారు. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళతారని.. కానీ ఈ మంత్రి కోర్టులోనే దొంగతనం చేశారని లోకేష్ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
కాగా నిన్న లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా పత్తికొండ, మారెళ్ల సమీపంలో బీసీ సంఘాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వివిధ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. బీసీ హాస్టళ్లలో సక్రమంగా భోజనాలు అందించడం లేదని ఓ మహిళా ప్రతినిధి తెలుపగా.. టీడీపీ అధికారంలోకి రాగానే నాణ్యమైన ఆహారం అందిస్తామని చెప్పారు. బీసీ ఉప కులాల దామాషా ప్రకారం బీసీ విద్యార్థుల కాలేజీ హాస్టళ్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. లాభసాటి వ్యవసాయంపై ప్రణాళిక ప్రకటిస్తామని తెలిపారు. పత్తికొండ, ఆలూరు ప్రాంతాల్లో టమోటా కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యాన పంటలకు ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు.
హంద్రీనీవా కాలువ పక్కనే ఉన్న సాగునీరు అందడం లేదని, దీంతో గుంటూరు, బెంగళూరు వలస వెళ్తున్నామని వెంకట్రాముడు అనే రైతు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని, 65 చెరువులకు హంద్రీనీవా నుంచి కృష్ణా జలాలు ఎత్తిపోసే పథకం 68 శాతం పూర్తయిందని తెలిపారు. టీడీపీ అధి కారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడమే కాకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని, మిగులు జలాలు రాయలసీమ జిల్లాలకు మళ్లించి వలసలు ఆపుతామని హామీ ఇచ్చారు. చేనేతల సంక్షేమం కోసం టీడీపీ కట్టుబడి ఉందని, కల్లుగీత కార్మికులను ఆదుకుంటామని, నీరా కేఫ్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా ఉపాధి హామీ కింద గీత, తాటి చెట్లు పెంపకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. చేనేత మగ్గం ఉన్న కార్మికులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. గతంలో మాదిరే నూలు, రంగలు, పట్టుపై సబ్సిడీ అందిస్తామని, చేనేతపై ఉన్న 5 శాతం జీఎస్‌టీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.
30 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు..
పోలీసు సర్వీసులో ఇన్ని ఇబ్బందులు ఏనాడూ చూడలేదని ఓ కానిస్టేబుల్ యువనేత లోకేష్‌ను కలిసి కన్నీరు పెట్టుకున్నాడు. మారెళ్ల శివారులో భోజన విరామ సమయంలో ఆ కానిస్టేబుల్ లోకేష్‌ను కలిశారు. విధి నిర్వహణలో బయటి ప్రాంతాలకు వెళితే.. కనీసం భోజనాలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని, ఒక్కో కానిస్టేబుల్‌కు టీఏ, డీఏ రూపంలో రూ.2 లక్షల వరకు ప్రభుత్వం నుంచి రావాలని, విదేశీ విద్య పథకం కింద తమ పిల్లల ఉన్నత చదువులకు దరఖాస్తు చేసినా ప్రయోజనం లేదని, వైసీపీ నాయకుల అడ్డగోలు పనులను అడ్డుకుంటే తమ అంతు చూస్తామని ఫోన్లలో బెదిరిస్తున్నారని వాపోయాడు. ఏకంగా పోలిస్‌స్టేషన్లకే వచ్చి బూతులు తిడుతున్నారని, మనస్సు చంపుకుని పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ ప్రభుత్వం రాగానే పోలీసులకు రావాల్సిన అన్ని బకాయిలతోపాటు పిల్లలకు ఉన్నత విద్యను అందించే బాధ్యత తీసుకుంటామని లోకేష్ భరోసా ఇచ్చారు.
Updated Date - 2023-04-17T12:46:13+05:30 IST