Lokesh: ‘మా అమ్మను అసెంబ్లీ సాక్షిగా అవమానించారు’
ABN, First Publish Date - 2023-05-04T14:49:27+05:30
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది.
కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (Nara Lokesh YuvaGalam) యువగళం పాదయాత్ర జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా పాణ్యం నియోజవర్గంలోని బొల్లవరంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఫ్యాన్ ఆరోగ్యానికి హానికరమని.. ఫ్యాన్ ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయన్నారు. దిశ చట్టం పెద్ద మోసమని.. అసలు చట్టమే లేకుండా స్టేషన్లు ప్రారంభించారని విమర్శించారు. వైసీపీ నాయకులే మహిళల్ని అసెంబ్లీ సాక్షిగా అవమానపరుస్తున్నారని.. అందుకే మహిళలపై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయని తెలిపారు. ‘‘మా అమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు. లోకేష్‌కు చీర, గాజులు పంపుతాం అని మహిళల్ని అవమానించే విధంగా మంత్రి రోజా మాట్లాడారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు చట్టాలు మాత్రమే కాదు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల్ని గౌరవించడం చిన్నప్పటి నుంచే నేర్పిస్తామన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళల గొప్పతనం, వారి కష్టం అందరికీ తెలిసేలా కేజీ నుంచి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తామన్నారు. విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని లోకేష్ విమర్శించారు.
విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఫెయిల్ అయ్యాయన్నారు. టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో భాగంగా ఫీజులు నేరుగా కాలేజీలకు చెల్లించామని గుర్తుచేశారు. జగన్ పాలనలో ఫీజులు నేరుగా తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి చెల్లించడం లేదన్నారు. జగన్ విద్యా దీవెన, వసతి దీవెన వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజీలకు బకాయి పడ్డ ఫీజులు అన్ని సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశారన్నారు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నారని.. ఇప్పుడు ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని యువనేత ప్రశ్నించారు.
మందుపై వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. జే బ్రాండ్ లిక్కర్ తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జే బ్రాండ్ లిక్కర్ విషం కంటే ప్రమాదమన్నారు. ఆ మద్యం తాగితే పైకి పోవడం ఖాయమని అన్నారు. అమ్మ ఒడి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఇస్తామని జగన్ మోసం చేసారన్నారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని.. ఇప్పుడా ఊసే లేదని తెలిపారు. జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. దీనికి ఒక కారణం పెట్రోల్, డీజిల్ ధరలన్నారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలో ఉన్నాయని అన్నారు. జగన్ బాదుడే బాదుడుకి ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు 8 సార్లు పెంచారని, ఆర్టీసి ఛార్జీలు 3 సార్లు పెంచారని, ఇంటి పన్ను, చెత్త పన్ను వేశారని ఆయన మండిపడ్డారు.
టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించి ధరలు తగ్గేలా చేస్తామన్నారు. నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తామని అన్నారు. డ్వాక్రా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారన్నారు. వడ్డీ లేని రుణాలు ఇస్తామని మోసం చేశారని తెలిపారు. ఆఖరికి తమరు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసిందని ఆరోపించారు. మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. మంగళగిరిలో మహిళలకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చామని... అక్కడితో ఆగకుండా ఒక మార్కెట్ లింకేజ్ చేసాని అన్నారు. అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహిస్తామన్నారు. సబ్సిడీ రుణాలు అందజేసి మహిళా పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు సహకరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
Updated Date - 2023-05-04T15:56:07+05:30 IST