Botsa Satyanarayana: పవన్ వ్యాఖ్యలపై బొత్స కామెంట్స్.. తెలంగాణ ఆఫ్ట్రాల్ అంటూ విమర్శలు
ABN, First Publish Date - 2023-07-13T11:42:46+05:30
వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన రీతిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలపై పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ అంటూ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) తనదైన రీతిలో స్పందించారు. పవన్ కళ్యాణ్ గాలి మాటలపై పొద్దు పొద్దున్నే మాకేందుకీ రచ్చ అంటూ వ్యాఖ్యలు చేశారు. అతని వ్యాఖ్యలపై ఎవ్వరూ పట్టించుకోకుంటేనే మంచిదన్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని హితవుపలికారు. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థ పై దుర్బుద్ధితో విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కో వాలంటీర్ 50 ఇళ్ల పరిధిని చూసుకుంటారన్నారు. ఆ 50ఇళ్ల పరిధిలో మన ఇంటి ఆడపిల్లల్ని లోబరుచుకుంటారంటూ కించపరిచే వ్యాఖ్యలు తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో డేటా చౌర్యం జరిగింది అని ఆరోపించారని.. ఇప్పుడు అదే ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారంటూ.. మీడియా అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకుండా మంత్రి బొత్ససత్యనారాయణ దాటవేశారు.
తెలంగాణను ఆఫ్ట్రాల్ అన్న మంత్రి..
ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. తెలంగాణలో చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామని అన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణ ది అంటూ వ్యాఖ్యలు చేశారు. మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.
ఆర్‌జీయూకేటీ ప్రోవిసినల్ లిస్ట్ విడుదల...
కాగా.. ఈరోజు ఉదయం రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ప్రోవిసినల్ లిస్ట్‌ను మంత్రి బొత్స విడుదల చేశారు. ఆరు సంవత్సరాల ఈ ట్రిపుల్ ఐటీ కోర్స్‌కు మొత్తం 4400 సీట్లు ఉన్నాయన్నారు. నూజువీడు, ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లకు ప్రవేశాలు ఉంటాయన్నారు. టాప్ 20 వచ్చిన విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాటశాలలో చదివిన వారే అని అన్నారు. ఈ ఆర్‌జీయూకేటీల్లో 100 శాతం అధ్యాపకులను నియమిస్తామన్నారు. ఈ నెల 20 నుంచి 25వ తేదీ వరకూ ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.
Updated Date - 2023-07-13T13:59:49+05:30 IST