Minister Botsa: రూ. 4 వేల కోట్ల స్కాం ఏంటి?.. వాటీజ్ దిస్ నాన్సెన్స్..?
ABN, First Publish Date - 2023-10-20T14:57:15+05:30
ప్రభుత్వ ప్రాధాన్యాతాంశంలో విద్యా రంగం ప్రధానమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. ఇటీవల కాలంలో కొందరు విద్యా రంగంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లల్లో అందించే ఖరీదైన విద్యను పేదలకు అందిస్తుంటే బురద జల్లుతున్నారన్నారు.
అమరావతి: ప్రభుత్వ ప్రాధాన్యాతాంశంలో విద్యా రంగం ప్రధానమైందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. ఇటీవల కాలంలో కొందరు విద్యా రంగంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లల్లో అందించే ఖరీదైన విద్యను పేదలకు అందిస్తుంటే బురద జల్లుతున్నారన్నారు. ఎన్నిసార్లు చెప్పినా అదే పనిగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు టోఫెల్ విషయంలో శిక్షణ ఇస్తామన్నామని.. టోఫెల్ విషయంలో కూడా విమర్శలు చేశారన్నారు. విద్యారంగంపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. సెలిబ్రిటీ పార్టీ మళ్లీ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐబీ ఒప్పందంపై మళ్లీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఐబీ ఒప్పందంలో ఏదో స్కాం జరిగిందనే ఆరోపణలు చేశారన్నారు. ఫైనాన్స్, న్యాయ విభాగాలు అభ్యంతరం తెలిపినా ఒప్పందం చేసుకున్నారని ఆరోపిస్తున్నారని అన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందకూడదనా..? ఆ సెలిబ్రిటీ పార్టీ ఉద్దేశ్యం అని ప్రశ్నించారు. ఐబీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎక్కడుందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఇంటర్నేషనల్ కరిక్యులమ్ కోసం స్టడీ చేయడమే ఒప్పందంలో ఉన్న సారాంశమన్నారు. కేవలం స్టడీ చేయడం కోసమే ఒప్పందం చేసుకుంటే.. రూ.4 వేల కోట్ల స్కాం ఏంటి.. వాటీజ్ దిస్ నానెన్స్..? అని మంత్రి విరుచుకుపడ్డారు.
టోఫెల్ కోసం కేవలం ఐదేళ్లకు రూ.145 కోట్లే ఖర్చు అవుతోందని చెప్పారు. ఇంగ్లీష్ భాష మీద గ్రిప్.. యాక్సెంట్ కోసమే టోఫెల్లో శిక్షణ అని చెప్పుకొచ్చారు. పేదవాడి కొడుకు పేదవాడిగానే ఉండాలా..? అని నిలదీశారు. ఐబీ ఒప్పందం కేబినెట్‌లో చర్చించే చేశామని..తామే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఐబీ ఒప్పందం కుదుర్చుకున్నాయని వెల్లడించారు. ట్యాబులైనా, బైజూస్ కంటెంటైనా, టోఫెల్ శిక్షణతో ఒప్పందమైనా, ఐబీతో ఎంఓయూ అయినా కేబినెట్‌లో చర్చించే నిర్ణయించామని తెలిపారు. ఇది ఏ ఒక్కరి నిర్ణయం కాదని.. ప్రభుత్వ విధానమని చెప్పారు. ఐబీతో ఒప్పందం విషయంలో ఫైనాన్షియల్ కమిట్మెంట్ లేదని... వాళ్లు ఉచితంగానే స్టడీ చేయడానికి ముందుకొచ్చారన్నారు. టోఫెల్, ఐబీ ఒప్పందం విషయాల్లో టెండర్లు పిలవనవసరం లేదని తాము నిర్ణయించుకున్నామన్నారు. ఆ ఒప్పందాలు కుదుర్చుకునే అంశంలో టెండర్లు పిలవాల్సిన అవసరం లేదని తాము భావించామన్నారు. ఈ ఒప్పందాల్లో సరఫరా చేసే అంశాలేవీ లేవని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
Updated Date - 2023-10-20T14:57:15+05:30 IST