Minister Botsa: డీఎస్సీపై శుభవార్త చెప్పిన మంత్రి బొత్స
ABN, First Publish Date - 2023-03-23T17:53:40+05:30
ఏపీ డీఎస్సీ (AP DSC)పై త్వరలోనే ఖాళీలు గుర్తించి కార్యాచరణ విడుదల చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) అన్నారు.
అమరావతి: డీఎస్సీ ఉద్యోగాల భర్తీపై మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) శుభవార్త చెప్పారు. ఏపీ డీఎస్సీ (AP DSC)పై త్వరలోనే ఖాళీలు గుర్తించి కార్యాచరణ విడుదల చేస్తామని మంత్రి అన్నారు. కేంద్రం పార్లమెంటులో ప్రకటించిన సమాచారం కూడా తప్పే, ఏపీ అధికారులు కొవిడ్‌కు ముందు ఉన్న సమాచారాన్ని కేంద్రానికి ఇచ్చారని మంత్రి చెప్పారు. అందుకే కేంద్రం నుంచి పొరపాటు ప్రకటన వచ్చిందని, తమ ప్రభుత్వం వచ్చాక 12 వేల పైచిలుకు ఖాళీలు భర్తీ చేశామని, త్వరలో ఖాళీలు గుర్తించి తగిన కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం అవాస్తవమని, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ప్రచారం వాస్తవం కాదని బొత్స సత్యనారాయణ అన్నారు.
మరోవైపు.. ‘ఎన్నికల్లో గెలుపోటములు సహజం. గెలిచిన చోట పార్టీకి సహకరించిన అంశాలతో పాటు ఓడిపోయిన చోట ఓటమికి కారణాలను పూర్తి స్థాయిలో సమీక్షిస్తాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ‘‘ఏ సెక్షన్ ప్రజల వల్ల ఓటింగ్‌లో తేడా వచ్చిందో కూర్చుని చర్చించుకుని, లోటుపాట్లను సరిదిద్దుకుంటాం. పట్టభధుల్ర ఎన్నికల ఫలితాలను వాపుగా భావించి, సాధారణ ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాడంటూ టీడీపీ చేస్తున్న వ్యాఖ్యల సరికావు. చంద్రబాబు వ్యాఖ్యలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్ధం కావట్లేదు. గత ప్రభుత్వంలో స్కిల్ డెవల్‌పమెంట్‌లో జరిగిన సీమెన్స్ దోపిడీపై ఆర్థిక మంత్రి వివరంగా సభలో చెప్పారు. ప్రజాధనాన్ని బందిపోటులా దోచుకున్న చంద్రబాబు అండ్ కో సీమెన్స్ కేసు నుంచి తప్పించుకోలేరు. న్యాయస్థానాల ముందు ముద్దాయిలుగా నిలబడక తప్పదు’’ అని బొత్స హెచ్చరించారు.
Updated Date - 2023-03-23T18:04:33+05:30 IST