MLC Elections: ఓటర్లకు డబ్బుల పంపిణీపై అధికారులతో మంత్రి ఉషశ్రీ చరణ్ మంతనాలు.. మంత్రి వీడియో వైరల్
ABN, First Publish Date - 2023-03-12T21:24:06+05:30
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అక్రమాలకు పాల్పడుతోంది.
అనంతపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) వైసీపీ ప్రలోభాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ (YCP Minister Ushasree Charan) అక్రమాలకు పాల్పడుతోంది. ఓటర్లకు డబ్బుల పంపిణీపై అధికారులు, కార్యకర్తలతో మంతనాలు జరుపుతోంది. కళ్యాణదుర్గం పరిధిలో పంచాయతీల వారీగా ఓటర్ లిస్టులను మంత్రి పరిశీలిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.వెయ్యి పంపిణీ చేయాలని మంత్రి ఉషశ్రీ చరణ్ సూచించారు. డబ్బు చేరిందో లేదో ఓటర్లకు ఫోన్ చేసి చెక్ చేసుకోవాలంటూ సలహా ఇస్తున్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పశ్చిమ రాయలసీమ (కడప-అనంతపురం-కర్నూలు) పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సహా ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు (MLC election) కీలక ఘట్టానికి చేరుకున్నాయి. పెద్దల సభకు ఎవరిని పంపించాలి..? విజ్ఞానవంతులు, మేధావివర్గానికి చెందిన పట్టభద్రులు, ఉపాధ్యాయులు కీలక తీర్పు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఈ ఎన్నికల తీర్పుపై దృష్టి సారించారు. ఏడాదిలో రానున్న అసెంబ్లీ సాధారణ ఎన్నికల (Assembly General Election) ముందు జరిగే సమరం కావడంతో విజ్ఞుల తీర్పు ఎలా ఉండబోతుందో..? అని ఎదురు చూస్తున్నారు. పోలింగ్‌కు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ మద్దతుతో అనంతపురం జిల్లా (Anantapur District)కు చెందిన వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ మద్దతులో కడప జిల్లా (Kadapa District) పులివెందుల పట్టణానికి చెందిన భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy), పీడీఎఫ్, వామపక్షాల మద్దతులో పోతుల నాగరాజు సహా 49 మంది బరిలో ఉన్నారు.
3,30,124 మంది పట్టభధ్రుల ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు వేసేందుకు 388 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అలాగే.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి అధికార పార్టీ మద్దతుతో ఎంవీ రామచంద్రారెడ్డి, పీడీఎఫ్ మద్దతుతో కత్తి నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్ మద్దతులో ఒంటేరు శ్రీనివాసులరెడ్డి సహా 12 మంది పోటీలో ఉన్నారు. 28,148 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు వేసేందుకు 175 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఆదివారం సాయంత్రానికే బ్యాలెట్స్, బ్యాలెట్ బాక్సులు సహా పోలింగ్ సామగ్రితో సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు.
ఉమ్మడి కర్నూలు జిల్లా స్ఝానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ ఎ.మధుసూదన్, స్వతంత్ర అభ్యర్థులు ఏపీ సర్పంచుల సంఘం మద్దతులో సర్పంచులు నర్ల మోహన్‌రెడ్డి, భూమా వెంకట వేణుగోపాల్‌రెడ్డిలు పోటీలో ఉన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి 1,178 మంది ఓటర్లు ఉన్నారు. సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. చివరి క్షణంలో స్వతంత్ర అభ్యర్థి నర్ల మోహన్‌రెడ్డికి టీడీపీ మద్దతు ఇచ్చింది. ఈ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు రాజకీయ వ్యూహాలకు పదును పెట్టినా ఫలితం దక్కలేదు.
స్వతంత్ర అభ్యర్థులు ప్రలోభాలకు తలొగ్గకపోవడంతో పోటీ అనివార్యమైంది. ఎలాగైనా గెలవాలనే లక్ష్యంగా వైసీపీ ముఖ్య నాయకులు ఓట్లు కొనుగోలుకు సై అన్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఓటర్లకు ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, ఉపాధ్యాయ ఓటర్లకు రూ.5 వేలు పంపిణీ చేసినట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 1,178 ఓటర్లలో వైసీపీ (YCP)కి చెందిన వారే 1,022 మంది ఉన్నా క్రాస్ ఓటింగ్ భయంతో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లకు రూ.50 వేలు వంతున పంచినట్లు విశ్వసనీయ సమాచారం. ఓటమి భయంతోనే వైసీపీ ముఖ్య నాయకులు ఓటుకు నోటుతో గాలం వేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు
Updated Date - 2023-03-12T21:27:02+05:30 IST