Murali Mohan: హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత చంద్రబాబుదే: మురళీ మోహన్
ABN, First Publish Date - 2023-10-02T13:53:48+05:30
భాగ్యనగరం హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదేనని సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు.
హైదరాబాద్: భాగ్యనగరం హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదేనని సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు. ‘‘ నేను అమెరికా దాటి ఎక్కడా ఆఫీసు పెట్టలేదు. ఒకవేళ ఇండియాకి వస్తే మొదటిసారి మీ దగ్గరికి వచ్చి ఆఫీసు పెడతాను’’ అని ఆనాడు చంద్రబాబుతో బిల్ గేట్స్ అన్నారని గుర్తుచేశారు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రాగానే ఒకరి తర్వాత ఒకరు అందరూ లైన్ కట్టి హైదరాబాద్ వచ్చారని అన్నారు. బిల్ గేట్స్‌ని హైదరాబాద్ హైటెక్ సిటీ ఓపెనింగ్‌కి చంద్రబాబు ఆహ్వానించారని గుర్తుచేశారు. 2000 సంవత్సరంలోనే విజన్ 20-20 అని ప్రారంభించిన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు అని, హైటెక్ సిటీ పెరుగుతుంటే దానికి కావాల్సిన వసతులన్నీ ముందుగానే ఊహించి దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేశారని మురళీ మోహన్ అన్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఢిల్లీలో పార్లమెంట్ దగ్గర దీని గురించి చర్చించామని మురళీ మోహన్ అన్నారు. ఆయన తొందరగా బయటికి రావాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. రాజ్‌ఘాట్ వెళ్లి అరగంట వేడుకున్నామని, ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్‌లో ఇప్పుడు సుహాసిని గారు నిరాహార దీక్ష చేస్తున్నారని అన్నారు. 74 సంవత్సరాల వ్యక్తిని, ఒక మంచి ముఖ్యమంత్రిని ఈరోజు జైల్లో పెట్టడం అన్యాయమని మురళీ మోహన్ వ్యాఖ్యానించారు. ఆయనను వెంటనే విడుదల కావాలని అన్నారు. రెట్టించిన ఉత్సాహంతో ఆయన ఇంకా ఇంకా మంచి పనులు చేయాలని ఆకాంక్షించారు. అరచేయితో సూర్యుని ఆపలేమని, గ్రహణం విడిచిన వెంటనే వచ్చే కాంతి ఎలా ఉంటుందో అందరికీ తెలుసునని, చంద్రబాబు కూడా గ్రహణం విడిచి అలా బయటికి వచ్చి అద్భుతంగా పనిచేయాలని తాను కోరుకుంటున్నట్టు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నగరం ఇవన్నీ కూడా అద్భుతంగా ఆయన అభివృద్ధి చేస్తారనే విశ్వసిస్తున్నానని చెప్పారు.
Updated Date - 2023-10-02T13:53:48+05:30 IST