Kirankumar Reddy : బీజేపీ తీర్థం పుచ్చుకున్న కిరణ్‌కుమార్ రెడ్డి.. కాంగ్రెస్‌పై విమర్శలు షురూ.. ఏమన్నారంటే...
ABN, First Publish Date - 2023-04-07T12:40:18+05:30
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో చేరారు.
ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీలో చేరారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్ సమక్షంలో బీజేపీలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ సభ్యత్వాన్ని అరుణ్ సింగ్ అందించారు. కిరణ్ కుమార్ రెడ్డికి కండువా కప్పి కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీలోకి ఆహ్వానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ బలోపేతం అవుతుందని ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, సీఎంగా కిరణ్ సేవలందించారన్నారు. కాంగ్రెస్‌లో ఆయన ఇన్నింగ్స్ ముగిసిందని.. బీజేపీలో చేరి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రధాని చేసున్న కృషి కిరణ్ కుమార్ రెడ్డిని ఆకర్షించిందన్నారు. ప్రధాని నేతృత్వంలో పనిచేయాలని భావిస్తున్నట్లు కొన్ని నెలల ముందు తనకు తెలిపారని ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కి క్లీన్ ఇమేజ్ ఉందన్నారు.
ఇక కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తానని తానెప్పుడూ అనుకోలేదన్నారు. తప్పుడు నిర్ణయాల వల్లే కాంగ్రెస్.. ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతోందన్నారు. విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ చెల్లాచెదురైందన్నారు. విభజనపై కాంగ్రెస్ ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం తీసుకుందన్నారు. నాయకత్వ లేమితో కాంగ్రెస్ ఇబ్బందులు పడుతోందన్నారు. బీజేపీ ఎదుగుతున్నా కొద్దీ కాంగ్రెస్ దిగజారుకుంటూ వచ్చిందన్నారు. 1980లో 7.7శాతం ఉన్న బీజేపీ ఓటింగ్..2019లో 37 శాతానికి పైగా పెరిగిందని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తమది 1952 నుంచి కాంగ్రెస్ కుటుంబమన్నారు. అయితే ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. కాంగ్రెస్ హైకమాండ్‌కు అధికారం మాత్రమే కావాలన్నారు. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్స్ లేకుండా పోయారన్నారు. దేశాన్ని వృద్ధి చేయాలన్నది బీజేపీ లక్ష్యం బీజేపీయేనన్నారు. గెలవాలనే తపన, దూరదృష్టి బీజేపీలో మాత్రమే ఉందన్నారు. మోదీ, అమిత్‌షా డైరెక్షన్‌లో బీజేపీ దూసుకుపోతుందని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
గత కొంత కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి ఆయన యాక్టివ్ పొలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. ఎందుకో కానీ ఆ పార్టీ అంతగా ఆదరణకు నోచుకోలేదు. దీంతో ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినా ఎప్పుడూ కూడా యాక్టివ్ పార్ట్ అనేది తీసుకోలేదు. ఇప్పుడు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన బీజేపీలో చేరినట్టు తెలుస్తోంది. మరోవైపు రాయలసీమలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు బీజేపీ సైతం ఆయనకు ఆహ్వానం పలికింది.
Updated Date - 2023-04-07T13:05:16+05:30 IST