Guntur: పల్నాడు, రేపల్లె ఎక్స్‌ప్రెస్.. ఈ రెండు రైళ్లలో జర్నీ చేస్తుండేవాళ్లకు ఈ విషయం తెలియాల్సిందే..!
ABN, First Publish Date - 2023-05-08T17:41:04+05:30
గతంలో సమయపాలనకు గుంటూరు రైల్వే డివిజన్ పెట్టింది పేరు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను 98 శాతం నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేర్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అవుతోన్నది. రైళ్ల సంఖ్య పెరగడమో, సికింద్రాబాద్ డివిజన్ నుంచి..
గుంటూరు (ఆంధ్రజ్యోతి): గతంలో సమయపాలనకు గుంటూరు రైల్వే డివిజన్ పెట్టింది పేరు. ఎక్స్‌ప్రెస్ రైళ్లను 98 శాతం నిర్ణీత సమయానికి గమ్యస్థానానికి చేర్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అవుతోన్నది. రైళ్ల సంఖ్య పెరగడమో, సికింద్రాబాద్ డివిజన్ నుంచి పగిడిపల్లి వద్ద గుంటూరు డివిజన్‌కి ఛేంజ్‌వోవర్ జరిగేటప్పటికే రైళ్లు ఆలస్యం అవుతోండటమో వెరసి ఇటీవల కాలంలో నడికుడి వైపు నుంచి వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలావరకు అరగంట నుంచి గంట వరకు ఆలస్యమౌతున్నాయి. దీంతో ప్రయాణికుల సహనానికి పరీక్షగా మారింది. ముఖ్యంగా లూప్‌లైన్లలో ఎక్కువ సమయం నిలుపుదల చేస్తుండటంతో ప్రయాణికులు అసంతృప్తికి గురౌతున్నారు. పల్నాడు, రేపల్లె ఎక్స్‌ప్రెస్‌ల టైమింగ్స్ మార్చినా ఎలాంటి ఉపయోగం లేకపోవడం విశేషం.
వికారాబాద్ - సికింద్రాబాద్ సెక్షన్‌తో పాటు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కి ఇబ్బంది ఉందని పల్నాడు ఎక్స్‌ప్రెస్ సమయాన్ని కొవిడ్‌కి ముందే మార్పు చేశారు. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మార్చిన తర్వాత రాత్రి 9 గంటలకు గుంటూరు రావాల్సిన ఈ రైలు ఇటీవల ఏ ఒక్క రోజు నిర్ణీత సమయానికి రాలేదు. నిత్యం అరగంట నుంచి 50 నిమిషాలు అలస్యమౌతున్నది. అలానే ఉదయం పూట సికింద్రాబాద్ నుంచి రేపల్లెకు వచ్చే ఎక్స్‌ప్రెస్ పరిస్థితి ఇంతే. సికింద్రాబాద్‌లో నిర్ణీత సమయానికి బయలుదేరక పోతోండటంతో ఈ రైలు గుంటూరుకు గంటల తరబడి ఆలస్యంగా వస్తున్నది. సాయంత్రం 6 గంటలకు రావాల్సిన రేపల్లె ఎక్స్‌ప్రెస్ నిత్యం గంట ఆలస్యం అవుతుండగా కొన్ని సందర్భాల్లో మూడు నుంచి నాలుగు గంటల ఆలస్యంగా వస్తున్నది. ఆదివారం ఇదే పరిస్థితి తలెత్తింది.
నడికుడి మార్గంలో ప్రయాణించి రాత్రికి గుంటూరుకు వచ్చే విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లది ఇదే వరస. వందేభారత్, ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఆదివారం వీక్లీ, స్పెషల్‌ట్రైన్స్ సికింద్రాబాద్ వైపు ఉండటంతో వాటి కోసం పల్నాడు, విశాఖ, చెన్నై, నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్‌లను లూప్‌లైన్‌లోకి తీసుకుని నిలిపేస్తున్నారు. ప్రయాణికుల నుంచి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చినప్పుడు డివిజన్ అధికారులు హెడ్‌క్వార్టర్స్ దృష్టికి తీసుకెళుతున్నారు. అప్పుడు ఒకటి, రెండు రోజులు నిర్ణీత సమయానికి కాస్త అటు, ఇటుగా గమ్యస్థానాలకు చేరుకునేలా చూస్తున్నారు. ఆ తర్వాత మళ్లీ యథాతథంగా సమయపాలన అనేది లేకుండా పోతున్నది. సత్తెనపల్లి నుంచి గుంటూరుకు ఆయా రైళ్ల టైంటేబుల్‌లో గంట నుంచి గంటన్నర వరకు సమయం కేటాయించినప్పటికీ ఇంకా ఆలస్యమౌతుండటంపై ప్రయాణికుల్లో అసంతృప్తి పెల్లుబుకుతున్నది.
Updated Date - 2023-05-08T17:41:28+05:30 IST