Parliament Special Session: ఆంధ్రప్రదేశ్ విభజనపై పార్లమెంట్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు..
ABN, First Publish Date - 2023-09-18T13:56:39+05:30
సోమవారం (నేడు) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టనున్న సందర్భం, పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనానికి సంబంధించిన పలు చారిత్రక ఘటనలను ఆయన గుర్తుచేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజనను (andhra pradesh bifurcation) ప్రస్తావించారు.
న్యూఢిల్లీ: సోమవారం (నేడు) ప్రారంభమైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టనున్న సందర్భం, పార్లమెంటు 75 ఏళ్ల ప్రస్థానం నేపథ్యంలో పాత పార్లమెంట్ భవనానికి సంబంధించిన పలు చారిత్రక ఘటనలను ఆయన గుర్తుచేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ విభజనను (andhra pradesh bifurcation) ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదని, ఈ విభజన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వర్గాలకు సంతృప్తి కలిగించలేకపోయిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఎంతో కష్టంతో జరిగిందని, రక్తం చిందించాల్సి వచ్చిందన్నారు. నూతన రాష్ట్రం వచ్చినా తెలంగాణ వేడుకలు జరుపుకోలేకపోయిందని మోదీ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ పార్లమెంట్ భవనంలోనే జరిగిందని, అయితే ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ మాదిరిగా ఏపీ, తెలంగాణ విభజన జరగలేదని పరోక్షంగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. వాజ్‌పేయీ హయాంలో మూడు రాష్ట్రాల విభజన ప్రణాళికాబద్ధంగా జరగగా అన్ని చోట్లా సంబరాలు జరిగాయని, అయితే ఆంధ్రప్రదేశ్ విభజన ఏపీ, తెలంగాణ వర్గాలనూ సంతృప్తిపర్చలేకపోయిందని అన్నారు.
పాత పార్లమెంట్ భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి
కొత్త పార్లమెంటు భవనానికి తరలి వెళ్లినా పాత పార్లమెంటు భవనం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని అని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) వ్యాఖ్యానించారు. పాత పార్లమెంట్ భవనంలో జరిగే చివరి సెషన్ చారిత్రాత్మకమైనదని అన్నారు. తాము కొత్త భవనానికి మారడానికి ముందు, ఇక్కడ ఒక చారిత్రాత్మక సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రయాణంలో ఇది ఒక కీలకమైన ఘట్టమని, ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటుందని అన్నారు. పాత పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని బ్రిటిష్ వారే నిర్ణయం తీసుకున్నప్పటికీ.. నిర్మాణానికి దేశవాసులు రక్తం, స్వేదం చిందించారని కొనియాడారు. గత 75 ఏళ్లుగా ఈ భవనంలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరూ భారతీయ సంస్కృతిని కాపాడారని ప్రశంసించారు.
G20 విజయం దేశానిది.. పార్టీలది కాదు
ఇటివలే విజయవంతంగా ముగిసిన జీ20 సదస్సుపై ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. జీ20కి అధ్యక్షత వహించడం భారతదేశానికి చెందిన విజయం అవుతుందన్నారు. వ్యక్తులకో లేదా పార్టీలకో అపాదించరాదని చెప్పారు. ఇది ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు. భారత్ నేడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతోందని, ఇందుకు దేశ సంస్కృతి, వేదాల నుండి వివేకానందుడి వరకు ప్రతిదీ కారణమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మరోవైపు... దేశం నుంచి తనకు లభిస్తున్న ప్రేమ, గౌరవం చూసి పొంగిపోతున్నానని అన్నారు. దేశం నుంచి ఇంతటి ప్రేమ, గౌరవం లభిస్తాయని తానెప్పుడూ ఊహించలేదన్నారు. రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై నిద్రించిన చిన్నారి ఏదో ఒక రోజు పార్లమెంటులో మాట్లాడతాడని ఊహించలేదని తన గతాన్ని గుర్తుచేసుకున్నారు. అందుకు తాను దేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని అన్నారు.
Updated Date - 2023-09-18T14:03:43+05:30 IST