Pattabhi: నాపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు.. జడ్జికి తెలిపిన పట్టాభి
ABN, First Publish Date - 2023-02-21T20:04:50+05:30
అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత పట్టాభిరామ్ (Pattabhi Ram)ను గన్నవరం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. తనపై గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్‌లో..
గన్నవరం: అనేక పరిణామాల మధ్య టీడీపీ నేత పట్టాభిరామ్ (Pattabhi Ram)ను గన్నవరం అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపర్చారు. తనపై గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్‌లో థర్డ్ డిగ్రీ (Third Degree) ప్రయోగించారని జడ్జికి పట్టాభి తెలిపారు. తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లేసరికి స్టాఫ్ ఎవరూ లేరని చెప్పారు. ముసుగు వేసుకుని ముగ్గురు వ్యక్తులు పీఎస్‌కు వచ్చి.. వేరే గదిలోకి ఈడ్చుకెళ్లి ముఖానికి టవల్ చుట్టి కొట్టారని జడ్జీకి వివరించారు. అంతేకాకుండా అరికాళ్లు, అరిచేతులపై తీవ్రంగా కొట్టారని చెప్పారు. తనను రాత్రంతా పోలీస్ స్టేషన్‌లు మార్చి హింసించారని జడ్జీకి పట్టాభిరామ్ వివరించారు.
సోమవారం సాయంత్రం 6 గంటలకు పట్టాభిని గన్నవరం జాతీయ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనే వైసీపీ మూకలు ఆయనపై దాడికి తెగబడ్డాయి. ఆయన కారును ధ్వంసం చేశాయి. అదే కారులో ఉన్న పట్టాభి డ్రైవర్, పీఏ, గన్‌మెన్‌ను దించివేసి.. పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు. ఫోన్‌ను స్విచాఫ్ చేశారు. రాత్రి 11 గంటలైనా ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లారో చెప్పలేదు. తన భర్తను ఏమైనా చేస్తారేమోనని పట్టాభి భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాభి ఆచూకి తెలియకపోవడంతో టీడీపీ (TDP) నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగారు. చివరికి నాటకీయ పరిణామాల తర్వాత ఆయనను గన్నవరం కోర్టు (Gannavaram Court)లో హాజరుపర్చారు. పట్టాభి, మరో 16మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. బోడె ప్రసాద్‌తో పాటు మరో 11 మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Updated Date - 2023-02-21T20:14:41+05:30 IST